
ప్రాణం తీసిన ఈత సరదా
నందవరం: సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి అనూక్(14) అనే బాలుడు మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. నందవరం మండలం సంజీవపురం గ్రామానికి చెందిన శివ, రాణెమ్మ దంపతులు ఏకై క కుమారుడు అనూక్(14) నాగలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి పూర్తి చేసుకున్నాడు. గురువారం గ్రామంలోని కొందరు తోటి స్నేహితులతో కలిసి పెద్దకొత్తిలి గ్రామం ఒడ్డున తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లాడు. లోతైన మగుడులో ఈత కొడుతూ ప్రమాదానికి గురయ్యాడు. అనుకోకుండా మడుగు నీటిలోకి జారిపోయాడు. తోటి స్నేహితులు తేరుకునేలోపే అనూక్ తుదిశ్వాస విడిచాడు. స్నేహితులు పెద్దకొత్తిలి గ్రామంలోకి పరుగులు పెడుతూ పెద్దలకు విషయం చెప్పారు. పెద్దలు అక్కడికి చేరుకుని మడుగులో గాలించారు. నీటి అడుగున విగత జీవిగా పడి ఉన్న అనూక్‌ను మడుగు నుంచి బయటకు తెచ్చారు. అప్పటికే అనూక్ నీరు మింగి శ్వాస విడచడంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు. అనంతరం సంజీవపురానికి అనూక్ మృతదేహాన్ని తీసుకెళ్లగా బంధువుల రోదనలు మిన్నంటాయి. ఒక్కగానొక్క బిడ్డ మృత్యువాత పడటంతో తల్లిదండ్రులకు దుఃఖమే మిగిలి. విషయం తెలుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.