
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
కర్నూలు(సెంట్రల్): పత్రికా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు. జిల్లావ్యాప్తంగా గురువారం జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అన్ని మండలాల్లో తహసీల్దార్ల, రెవెవన్యూ కేంద్రాల్లో ఆర్‌డీఓలకు వినతిపత్రాలు సమర్పించారు. కర్నూలులో ఏపీడబ్ల్యూజేఎఫ్ నగర అధ్యక్షుడు ఎం.శివశంకర్ అధ్యక్షతన కలెక్టరేట్ ఎదుట గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా బుద్ధిని ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోరంట్లప్ప, జిల్లా కన్వీనర్ నాగేంద్ర, ఫొటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు హుస్సేన్, సాక్షి బ్యూరో రవికుమార్. సాక్షి టీవీ కరస్పాండెంట్ లోకేష్ మాట్లాడుతూ.. సాక్షి ఎడిటర్ ఆర్. ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టటం అన్యాయమన్నారు. సాక్షి ఎడిటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, అందులో భాగంగా అక్రమ కేసులు పెడుతోందన్నారు. గురువారం ఎడిటర్ నివాసానికి వెళ్లిన పోలీసులు సర్చ్ వారంట్ లేకుండా గంటకుపైగా విచారణ జరిపి నోటీసులు ఇవ్వడం, ఏ కేసులో విచారణ చేస్తున్నారో చెప్పకపోవడం అన్యాయమన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రభుత్వం గౌరవించాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 11 నెలల కాలంలో మీడియాపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, ఎక్కడిక్కడే పోలీసులు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైకి నీతులు చెబుతూ..లోలోపలా మాత్రంపై మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పటికై నా మీడియాకు రక్షణచట్టం తేవాలని కోరారు.
జిల్లా అంతటా జర్నలిస్టులు,
జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో
నిరసన ప్రదర్శనలు
‘పోలీసులది అనుచిత ధోరణి’
తమకు అనుకూలంగా లేని పత్రికలపై పోలీసులను అడ్డుపెట్టుకొని లొంగదీసుకోవాలను కోవడం అవివేకమైన చర్య అని ఐజేయూ జాతీయ సమితి సభ్యులు కె.నాగరాజు, ఎపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.వెంకటసుబ్బయ్య, జిల్లా గౌరవ సలహాదారుడు, రాష్ట్రసమితి సభ్యులు వైవీ కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఈఎన్‌రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసగౌడ్ గురువారం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విజయవాడలో ‘సాక్షి’ ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు బలవంతంగా చొరబడి తనిఖీలు చేసిన అనుచితధోరణి దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. పాత్రికేయులను భయపెట్టడానికి మాత్రమే పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాని, ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందని చెప్పారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఇలాంటి చర్యలను మానుకోకపోతే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.