
చిన్నారులకు టీకా వేస్తున్న వైద్యులు, సిబ్బంది
కర్నూలు(హాస్పిటల్): గతంలో ఏదో ఒక కారణం వల్ల వ్యాక్సినేషన్ వేయించుకోని పిల్లలకు మరోసారి వ్యాక్సిన్‌వేయించుకునే అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ యేడాది రెండు విడతల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులు, గర్భిణులకు వ్యాక్సిన్ వేశారు. తాజాగా మూడో విడత వ్యాక్సిన్ వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో 35 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 26 అర్బన్‌హెల్త్ సెంటర్లు, 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, రెండు ఏరియా ఆసుపత్రులు, కర్నూలులో ఒక బోధనాసుణులు, చిన్నారులకు టీకాలు వేస్తున్నారు. గతంలో వలసలు, ఊరెళ్లడం, వివాహాది శుభకార్యాలు, కోవిడ్ పరిస్థితులు, ఇతర కారణాలతో రెండేళ్లలోపు చిన్నారులకు, గర్భిణులకు రొటీన్ ఇమ్యునైజేషన్(టీకాలు) వేయించకపోతే ప్రస్తుత మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో టీకాలు వేయించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు విడతల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. తాజాగా ఇప్పుడు ఈ నెల 11 నుంచి 16వ తేదీ వరకు మూడో విడత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 9 నుంచి 11 నెలల్లోపు పిల్లలు 1,143 మంది, ఏడాది నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 229 మంది, 16 నెల నుంచి 24 నెలల్లోపు పిల్లలు 963 మంది, రెండు నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 144 మంది ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ఏడాదిలోపు పిల్లలు 1,711 మంది, ఒకటి నుంచి ఐదేళ్లలోపు పిల్లలు 974 మంది ఉన్నట్లు తేల్చారు. వీరితో పాటు 1,007 మంది గర్భిణులకు కూడా టీకాలు వేయనున్నారు. వీరందరికీ మూడో విడత మిషన్ ఇంద్రధనస్సులో టీకాలు వేయనున్నారు.
ఆసుపత్రుల్లో రెగ్యులర్‌గా వేసే టీకాలు
● శిశువు జన్మించినప్పుడు ఆసుపత్రిలో 24 గంటల్లోపు బీసీజీ, ఓపీవీ(జీరో డోస్), హెపటైటిస్–బి(బర్త్ డోస్)
● ఆరు వారాలకు ఓపీవీ–1, పెంటావాలెంట్–1, ఐపీవీ–1, రోటావైరస్–1, పీసీవీ–1
● 10 వారాలకు ఓపీవీ–2, పెంటావాలెంట్–2, రోటావైరస్–2
● 14 వారాలకు ఓపీవీ–3, పెంటావాలెంట్–3, ఐపీవీ–2, రోటా–3, పీసీవీ–2
● 9 నెలలకు మీజిల్స్ రూబెల్లా–2, జేఈ–1, విటమిన్–ఎ, పీసీవీ బూస్టర్
● 16 నుంచి 24 నెలలకు డీపీటీ–1 బూస్టర్, ఓపీవీ బూస్టర్, మీజిల్స్ రూబెల్లా–2, జేఈ–2
● వీటిలో చిన్నారులకు ఏవైనా వేయించకపోతే మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా టీకా వేయించవచ్చు.
సద్వినియోగం చేసుకోండి
ఏదైనా కారణం చేత రెండేళ్లలోపు చిన్నారులకు గతంలో టీకాలు వేయించకపోతే మూడో విడత మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో మొదటి, రెండో విడత కార్యక్రమాల్లో చిన్నారులు, గర్భిణులకు టీకాలు వేశాం. ఇంకా మిగిలిన వారికి మూడో విడతలో వేయనున్నాం. టీకాలు వేయించుకోవాల్సిన వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఫలానా రోజు, ఫలానా టీకా వేయించుకోలేదని చెబితే వెంటనే వారు టీకా వేస్తారు. టీకాలు వేసుకోడం వల్ల ప్రాణాపాయ వ్యా ధుల నుంచి రక్షణ లభిస్తుంది. వీటి వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. – డాక్టర్ వై.ప్రవీణ్‌కుమార్,
జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి, కర్నూలు
జిల్లాలో 4,405 మందికి టీకాలు
గతంలో వేయించుకోలేని వారికి
అవకాశం