
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆదాయం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను పాణ్యం ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ గౌరవ చైర్మన్ కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మార్కెట్ యార్డులో కమిటీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మార్కెట్ కమిటీ సమావేశంలో కాటసాని మాట్లాడారు. 2023–24లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా రూ.6.15 కోట్లు ఆదాయం సాధించే విధంగా మార్కెట్ కమిటీ నిర్ణయించిందని, ఆదాయం పక్కదారి పట్టకుండా సూపర్‌వైజర్లు, అసిస్టెంటు సెక్రటరీలు నిఘా పెంచాలని సూచించారు. 2023 మార్చి 31 నాటికి మార్కెట్ యార్డులోని 175 మంది కమీషన్ ఏజెంట్ల లైసెన్స్ గడువు పూర్తి అయిందని, వీటిని పారదర్శకంగా రెన్యువల్ చేయాలన్నారు. మార్కెట్ యార్డులో రూ.6 కోట్లతో చేపట్టిన జంబోషెడ్ నిర్మాణపు పనులు కాస్త మందగించాయని, పనులను వేగవంతం చేయాలన్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. మార్కెట్ యార్డులో పరిశుభ్రతను పెంపొందించేందుకు నగర పాలకసంస్థ తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్కెట్ యార్డు అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు మార్కెట్‌లో మోసానికి గురి కాకుండా ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో ఎంపిక శ్రేణి సెక్రటరీ గోవిందు, వైస్ చైర్మన్ భీమేశ్వరరెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీలు రహిమాన్, వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్‌లు కేశవరెడ్డి, శివన్న తదితరులు పాల్గొన్నారు.
పారదర్శకంగా కమీషన్ ఏజెంట్ల లైసెన్సుల రెన్యువల్
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి