World Oral Health Day: నోరు మంచిదైతే..!

- - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): నోరు మంచిదైతే..ఊరు మంచిదవుతుందన్న సామెత ఉంది. అలాగే నోటికీ ఆరోగ్యానికి సంబంధం ఉందంటున్నారు వైద్యులు. కోవిడ్‌ అనంతరం నోటి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. యువకులు, మధ్యవయస్సు వారిలో నోటి దుర్వాసన అధికమైంది. అనుకోని ఈ రుగ్మత ఏమిటో అర్థం గాక జనం తల పట్టుకుంటున్నారు. నోరు పట్టుకుని దంత వైద్యుల వద్దకు క్యూ కడుతున్నారు. దీంతో పాటు పలు దంత వ్యాధులకు చికిత్స చేయించుకునేందుకు, నోటి ఆరోగ్యం, అందం కోసం వారిని సంప్రదించే వారు అధికమయ్యారు. ఈ నెల 20వ తేదిన ‘నోటి ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.

బ్యాక్టీరియానే కారణం..
టి దుర్వాసనకు కారణం నిత్యం మన నోట్లో ఉత్పత్తి అవుతున్న బ్యాక్టీరియానేని వైద్యులు చెబుతున్నారు. తరచూ నోటిని శుభ్రం చేసుకోకపోతే ఇది దుర్వాసన కలిగించి క్రమంగా నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధికంగా మాట్లాడే వారిలో, నీటిని తక్కువగా తాగే వారిలో ఈ సమస్య మరింత అధికంగా ఉంటోంది. సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, జీర్ణాశయ సమస్యలున్న వారిలోనూ ఈ సమస్య వస్తుందని వైద్యులు చెబుతున్నారు.

పెరుగుతున్న దంత సమస్యలు
జిల్లాలో 70 నుంచి 80 శాతం ప్రజలు దంత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. కర్నూలుతో పాటు, దేవనకొండ, పత్తికొండ, కోడుమూరు, కల్లూరు, ఆదోని, ఆస్పరి వంటి ప్రాంతాల్లో తాగునీటి సమస్య వల్ల ఫ్లోరైడ్‌ ఎక్కువగా ఉండే నీటిని తాగుతున్నారు. దీనివల్ల పంటిపై పచ్చని రంగులో మచ్చలు ఏర్పడతాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు సరిగ్గా టూత్‌బ్రష్‌ చేయకపోవడం, ఏదైనా తిన్న తర్వాత నోటిని పుక్కిలించకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయి. పంటి చుట్టూ గార ఏర్పడి చిగుళ్లు ఇన్‌ఫెక్షన్స్‌గా మారి రక్తం కారుతూ నొప్పి పుడుతుంది. నగరాలు, పట్టణాల్లో సైతం 60 నుంచి 70 శాతం మంది పిప్పి సమస్యలతో బాధపడుతున్నారు.

ఉన్నఫలంగా ఊడిపోతున్న పళ్లు
ఇటీవల కాలంలో 35 ఏళ్ల నుంచి 58 ఏళ్ల వయస్సున్న వారిలో దంత సమస్యలు అధికమయ్యాయి. అది కూడా ఉన్నఫలంగా దంతాలు ఊడిపోవడం వారిని మరింత కలవరపెడుతోంది. కర్నూలు నగరంలోని దంత వైద్యుల వద్దకే ప్రతి నెలా 200 నుంచి 300 మంది దాకా అకస్మాత్తుగా దంతాలు ఊడిపోయి వైద్యుల వద్దకు వస్తున్నారు. ఊహించని ఈ పరిమాణం ఏమిటో అర్థం గాక అటు బాధితులు, ఇటు వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కోవిడ్‌–19 పరిస్థితుల తర్వాత(పోస్ట్‌ కోవిడ్‌) ఈ పరిమాణం అధికమైందని వారు గుర్తించారు. కోవిడ్‌ తర్వాత షుగర్‌ రోగుల సంఖ్య పెరగడం, పోషకాహరలోపం కారణంగా వారు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత విశ్లేషణ జరుపుతున్నారు. దంతాలు ఊడిపోయి వచ్చిన వారికి ఇన్‌ప్లాంట్స్‌ వేయడం, పళ్లు కట్టడం చేసి పంపిస్తున్నారు.

నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే చెడు అలవాట్లు
చాలా మందికి ధూమపానం(పొగతాగడం) వల్ల నోటిపై గారపట్టడం, దుర్వాసన, పళ్లు రంగుమారడం జరుగుతాయి. దీంతో పాటు చిగుళ్లు సైతం బాగా దెబ్బతింటాయి. గుట్కా, జర్దా నమిలే వారిలో ఈ సమస్య మరింత ఎక్కువ. వీరికి అదనంగా నోటి క్యాన్సర్‌ కూడా వస్తోంది. మద్యపానం చేసే సమయంలో ఇష్టానుసారంగా ఆహారాన్ని తినడం, అది కూడా నమిలి తినకపోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, పళ్లలో ఆహార పదార్థాలు ఇరుక్కుని రాత్రంతా అలాగే ఉండటం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది నోటి సమస్యలు వస్తున్నాయి.

కోవిడ్‌ తర్వాత సమస్యలు ఎక్కువయ్యాయి
ఇటీవల కాలంలో చిన్న వయస్సు వారి నుంచి పెద్ద వయస్సు వారిలో నోటి దుర్వాసన సమస్య అధికమైంది. మా వద్దకు వచ్చే రోగుల్లో ఎక్కువగా ఈ సమస్యనే చెబుతున్నారు. దీనికి కారణం నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, పిప్పిపళ్లు, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం. అయితే ఇవేమీ సమస్యలు లేకుండానే ఇటీవల కొందరికి నోటి దుర్వాసన వస్తోంది. అంటే వారికి త్వరలో డయాబెటీస్‌ రావడం, లేదా ఇప్పటికే వచ్చి ఉండటం జరుగుతోంది. పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత ఈ సమస్య మరింత అధికమైంది. –డాక్టర్‌ పి. సునీల్‌కుమార్‌రెడ్డి,  దంత వైద్యనిపుణులు, కర్నూలు

త్రిఫల కషాయంతో నోటిని పుక్కిలించాలి
నోటి శుభ్రంగా ఉంచుకోకపోతే అనేకవ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. నోరు శుభ్రంగా ఉండాలంటే ముఖ్యంగా త్రిఫల కషాయంతో నోటిని పుక్కిలించాలి. దీనివల్ల నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. నోటి క్యాన్సర్లు, నోటి అల్సర్లు రాకుండా కాపాడుకోవచ్చు. రాత్రి త్వరగా భోజనం చేయాలి. ఎడమవైపు తిరిగిపడుకోవాలి. దీని వల్ల తిన్న ఆహారం గొంతులోకి రాకుండా ఉంటుంది. ఆయుర్వేదిక్‌ నేచురల్‌ టూత్‌పేస్ట్‌లతో దంతాలను శుభ్రం చేసుకోవాలి.
–డాక్టర్‌ ద్వారం ప్రభాకర్‌రెడ్డి, సీనియర్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యులు, కర్నూలు

Read latest Kurnool News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top