పూత ఎండమామిడి | - | Sakshi
Sakshi News home page

పూత ఎండమామిడి

Dec 1 2025 1:15 PM | Updated on Dec 1 2025 1:17 PM

పూత ఎండమామిడి

80 శాతానికిపైగా మామిడి తోటల్లో కనిపించని పూత ఈ ఏడాది దిగుబడి 30 శాతానికి మించదని అంచనా అకాల వర్షాలతో గతేడాది తీవ్రంగా నష్టపోయిన రైతులు ఒక్క రూపాయి నష్ట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం

నష్ట పరిహారం ఊసేలేదు

జి.కొండూరు: మామిడి తోటల్లో చెట్లకు పూత కనిపించడంలేదు. ఈ పాటికి పూతతో కళకళలాడాల్సిన చెట్లు వెలవెలబోతున్నాయి. అకాల వర్షాలు, పురుగులు, తెగుళ్ల దాడితో గత ఏడాది తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేలా లేవు. సాధారణంగా నవంబరు నెల నుంచి పూత ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటి వరకు 80 శాతానికి పైగా మామిడి తోటల్లో అసలు పూతే కనిపించడంలేదు. ఒకవేళ ఆలస్యంగా పూత వచ్చినా ప్రకృతి వైపరీత్యాలు, పురుగులు, తెగుళ్లను తట్టుకొని నిలబడడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది దిగుబడి 50 శాతానికి పడిపోగా ఈ ఏడాది 30 శాతం దిగుబడి రావడం కూడా కష్టమేనని రైతులు అంచనా వేస్తున్నారు. గతేడాది అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం కూడా అందించకపోవడంతో అప్పులపాలై లబోదిబోమంటున్నారు. మామిడి సాగుతో నష్టాలు వస్తుండడంతో ఏటా పదిశాతం తోటలను తొలగించి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్నారు.

పూత రావడం కష్టమే..

గతేడాది ప్రారంభంలో మామిడి ధర ఊరించినప్పటికీ పురుగులు, తెగుళ్లు, ఆకాల వర్షాలతో కాయ నాణ్యత పడిపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధర పతనమైంది. దీనితో కోత కూలి కూడా వచ్చే అవకాశం లేక రైతులు ఆఖరి కోతలను ఆపేశారు. కాయలు చెట్లపైనే పండిపోయి రాలిపోయాయి. దీని వల్ల చెట్ల కొమ్మల్లో ఉండే బలం మొత్తం తగ్గిపోయి ఈ ఏడాది పూత రావడంలేదని రైతులు చెబుతున్నారు. ఆలస్యంగానైనా పూత వచ్చే అవకాశం ఉండదని మరో ఏడాది గడిస్తే కానీ పూత వచ్చే అవకాశం ఉంటుందని రైతులు చెబతున్నారు. దీని వల్ల ఈ ఏడాది కూడా రైతులు మామిడిపై ఆశలు వదిలేసుకున్నారు.

ఏటా నష్టాలే..

ఈ ఏడాది పూత పరిస్థితిని బట్టి 30 శాతం కూడా మామిడి దిగుబడి వచ్చేలా లేదని రైతులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రెడ్డిగూడెం, విస్సన్నపేట, విజయవాడ రూరల్‌ మండలాల్లో అక్కడిక్కడా కొద్దిపాటు మామిడి తోటల్లో పూత వచ్చి పిందెలు కాస్తున్న క్రమంలో తుపానులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో 2023–24 సంవత్సరంలో 1.76 లక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చింది. గతేడాది 85 వేల టన్నులు మాత్రమే దిగుబడి వచ్చింది. మామిడి కోతల ప్రారంభంలో రెడ్డిగూడెం మండల పరిధి మిట్టగూడెం మ్యాంగో మార్కెట్లో బంగినపల్లి టన్ను రూ.1.20 లక్షలు, తోతాపురి టన్ను రూ.70 వేలు, రసాలు టన్ను రూ.40 వేలకు అమ్ముడుపోగా ఆఖరికి టన్ను బంగినపల్లి రూ.5 వేల నుంచి రూ.10 వేలు, తోతాపురి, రసాలు టన్ను రూ.2 వేల నుంచి రూ.5వేలకు ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

జిల్లాలో మామిడి సాగు ఇలా..

ఎన్టీఆర్‌ జిల్లాలో పదహారు మండలాల్లో పదహారు వేల మంది రైతులు 22,896 హెక్టార్లలో మామిడిని సాగు చేస్తున్నారు. మండలాల వారీగా వత్సవాయి మండల పరిధిలో 165 హెక్టార్లు, జగ్గయ్యపేట 295 హెక్టార్లు, పెనుగంచిప్రోలు 244 హెక్టార్లు, నందిగామ 251 హెక్టార్లు, వీరులపాడు 113 హెక్టార్లు, మైలవరం 3,353 హెక్టార్లు, గంపలగూడెం 616 హెక్టార్లు, తిరువూరు 817 హెక్టార్లు, ఎ.కొండూరు 2,336 హెక్టార్లు, రెడ్డిగూడెం 4,450 హెక్టార్లు, విస్సన్నపేట 5,817హెక్టార్లు, జి.కొండూరు 2,324 హెక్టార్లు, కంచికచర్ల 125 హెక్టార్లు, చందర్లపాడు 20 హెక్టార్లు, ఇబ్రహీంపట్నం 18 హెక్టార్లు, విజయవాడ రూరల్‌ 1,952 హెక్టార్లలో మామిడి తోటలు సాగువుతున్నాయి.

గతేడాది పురుగులు, తెగుళ్లతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోగా ఏప్రిల్‌లో వచ్చిన అకాల వర్షాలు, పెనుగాలులకు జిల్లాలో 15,300 హెక్టార్లలో 50 శాతానికిపైగా కాయలు నేలరాలి తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపినప్పటికీ రైతులకు చిల్లిగవ్వ కూడా పరిహారంగా ఇవ్వలేదు. జిల్లాలో 279 మంది రైతులు మాత్రమే 246 ఎకరాలకు బీమా ప్రీమియం చెల్లించారు. బీమా ప్రీమియం చెల్లించి పంట నష్టపోయిన రైతులకు సైతం ఇంతవరకు బీమా సొమ్ము అందలేదు.

పూత ఎండమామిడి 1
1/2

పూత ఎండమామిడి

పూత ఎండమామిడి 2
2/2

పూత ఎండమామిడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement