కార్తికేయుని సన్నిధిలో భక్తజన సందడి
మోపిదేవి: మండల కేంద్రమైన మోపిదేవిలో వేంచేసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా కనిపించింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగపుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వర ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆన్‌లైన్ ఆర్జిత సేవల బుకింగ్ ప్రారంభం
సుబ్రహ్మణ్యస్వామి ఆర్జితసేవల పూజలను భక్తులు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిసర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆదివారం వెల్లడించారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సర్పదోష నివారణ, రాహుకేతు పూజలు, శాంతి కళ్యాణం, సుప్రభాతం, అష్టోత్తరపూజ, సహస్ర నామార్చన, అభిషేకం వంటి ఏడు రకాల పూజలకు ఆన్‌లైన్‌లో రిజస్టర్ అయి లాగిన్ ద్వారా తేదీ, టైం, స్లాట్‌ను ముందుగా బుక్ చేసుకోవచ్చని వివరించారు.
● స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్క రోజు వివిధ సేవా టికెట్ల రూపంలో ఆదాయం రూ. 9,82,581 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు వెల్లడించారు


