గిరిజనులపై సర్కార్ నిర్లక్ష్యం
చిలకలపూడి(మచిలీపట్నం): మైదాన ప్రాంత గిరిజనులపై చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలని గిరిజన ప్రజా సమాఖ్య జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ పేర్కొన్నారు. మచిలీపట్నం ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం గిరిజన ప్రజా సమాఖ్య, విద్యార్థి సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కేటాయించే నిధులు సద్వినియోగం కావాలంటే చట్టసభల్లో గిరిజనులకు సరైన ప్రాతినిథ్యం ఉండాలన్నారు. 1967లో జిల్లా యూనిట్ స్థానంలో రాష్ట్ర యూనిట్ విధానాన్ని అమలు చేయడంతో గిరిజనులకు నష్టం వాటిల్లిందన్నారు. ఎస్టీ జాబితాలోకి ఇతర కులాలను చేర్చే ప్రతిపాదనలను గిరిజన సంఘాలు ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానించారు. సమావేశంలో వివిధ గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గిరి జన ప్రజా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, కార్పొరేటర్ యాకసిరి వెంకటేశ్వరరావు, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ నాయక్, రవి నాయక్, పద్మరాజు, నాగరాజు, పాండు రంగారావు, కిరణ్, హనుమంతు నాయక్, సత్యనారాయణ, వెంకటరత్నం పాల్గొన్నారు.


