
యోగాతో మానసిక ప్రశాంతత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రోజూ యోగ సాధన చేయడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా ప్రశాంతత చేకూరుతుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. వ్యతిరేక ఆలోచనలు దూరమవుతాయని తెలిపారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50 రోజుల పాటు నిర్వహించిన యోగా ఉచిత శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని అసోసియేషన్ హాలులో బుధవారం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ హాజరై యోగ సాధన చేసిన వారికి సర్టి ఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. యోగాంధ్ర కార్యక్రమం జిల్లాలో విజయవంతం కావడంలో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ పాత్ర ఉందన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఆరు వేల మంది యోగా గురువులతో తొమ్మిది లక్షల మందికి యోగాను చేరువ చేశామని తెలిపారు. యోగాను వ్యాయామంగా కాకుండా జీవితంలో ఒక భాగంగా చూడాలన్నారు. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మిరియాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. యువత చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే యోగ సాధన చేయాలన్నారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు దాసరి కాశీ విశ్వనాథ్, కార్యదర్శి పి.వి.రమణ, కోశాధికారి ఎ.లావణ్యకుమార్, రిటైర్డ్ డీసీపీ హరికృష్ణ, యోగా గురువు అంకాల సత్యనారాయణతో పాటుగా యోగ సాధకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సభ అనంతరం కలెక్టర్ లక్ష్మీశ యోగ సాధకులతో కలిసి యోగాసనాలు, ప్రాణా యామం చేశారు. యోగా గురువు అంకాల సత్యనారాయణను కలెక్టర్ లక్షీశ తోపాటుగా అసోసియేషన్ సభ్యులు సత్కరించారు.