
కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని చాటాలి
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పి, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ ఆకాంక్షించారు. కొండపల్లి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో జరుగుతున్న పనులను పర్యాటక, మునిసిపల్ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. కళాత్మక సౌందర్యం ఉట్టిపడేలా వేసిన మ్యూరల్ పెయింటింగ్స్‌ను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో మిగిలిన పనులు త్వరితగతిన పూర్తిచేసి వీలైనంత త్వరగా పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ పనులను పూర్తిచేయాలన్నారు. చారిత్రక, సాంస్కృతిక ఔన్నత్యమున్న జిల్లాను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నా మని, ఇందులో భాగంగా శతాబ్దాల చారిత్రక నేపథ్యం కలిగిన కొండపల్లి బొమ్మల విశిష్టతను పర్యాటకులకు చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎ.శిల్ప, కొండపల్లి మునిసిపల్ కమిషనర్ రమ్యకీర్తన, తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ