
సత్తాచాటిన చోరంపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు
బంటుమిల్లి: మండలంలోని చోరంపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్ షిప్పులు సాధించి రికార్డు సృష్టించారు. 15 మంది విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లతో చోరంపూడి పాఠశాల జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. బుధవారం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. 2024 సంవత్సరంలో పాఠశాల నుంచి 17 మంది విద్యార్థులు ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష రాశారు. వారిలో 15 మంది స్కాలర్‌షిప్పులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం వి.ధనలక్ష్మి మాట్లాడుతూ.. తమ విద్యార్థులు తమ్ము పెద్దిరాజు, కొక్కిలిగడ్డ స్నేహశ్రీ జిల్లాలో ప్రథమ, ద్వితీయ ర్యాంకులు సాధించారని తెలిపారు. జిల్లా స్థాయిలో పాఠశాలకు గుర్తింపు తెచ్చి ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేసిన సోషల్ మాస్టర్ కె.శివరామప్రసాదుతోపాటు ఉపాధ్యాయులు, శ్రమించిన విద్యార్థులను ఎంఈఓ–2 వెంకటేశ్వరరావు స్వయంగా, ఎంఈఓ–1 మునీబ్‌బాను ఫోన్‌లో అభినందించారు.