
ఆలయాలపై జరిగిన దాడులపై విచారణ చేపట్టాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): హిందూ ఆలయాలపై గతంలో జరిగిన దాడులపై విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ డిమాండ్ చేశారు. ఆలయాలపై దాడులు, కూల్చివేతకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో జాతీయ హిందూ ధార్మిక సదస్సు–2025 బుధవారం జరిగింది. ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుంచి సాధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సదస్సు పాల్గొన్న మాధవ్ మాట్లాడుతూ.. దేవాలయాల ద్వారానే మన దేశ నిర్మాణం, సామాజిక వ్యవస్థల ప్రతిష్ట జరిగాయన్నారు. దేవాలయాలు, గోవులను సంరక్షిస్తే మన ధర్మం నిలుస్తుందన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ మాట్లాడుతూ.. తిరుపతి, తిరుమల క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా గుర్తించాలని కోరారు. తిరుమల, తిరుపతిలో మద్యం, మాంసం విక్రయాలను నిషేధించాలని కోరారు. దేవాలయ భూములు, ఆస్తులను ఆన్‌లైన్ చేయాలని కోరారు. ఈ సదస్సులో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సంఘటనా కార్యదర్శి రవి కుమార్, సాధుపరిషత్ గౌరవాధ్యక్షుడు అట్లూరి నారాయణ రావు, గజల్ శ్రీనివాస్, బీజేపీ నాయకులు నాగోతు రమేష్ నాయుడు, అడ్డూరి శ్రీ రాం, మిట్టా వంశీ తదితరులు పాల్గొన్నారు.