
వైభవంగా సారె సంబరం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు ఆషాఢ మాస సారెను తమ సంప్రదాయాల మేరకు సమర్పిస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు బుధవారం అమ్మవారికి సారె సమర్పించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచే ప్రారంభమైన సారె సంబరం సాయంత్రం వరకు కొనసాగింది. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్న భక్త బృందాలకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా భక్త బృందాలను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అమ్మవారి దర్శనం అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి భక్తులు సారె సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో తమ తోటి భక్త బృందాలకు, భక్తులకు సారెను ప్రసాదంగా పంపిణీ చేశారు. బుధవారం 30కి పైగా భక్త బృందాలు, 500 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.