
ఫలించిన వంశీ న్యాయ పోరాటం
గన్నవరం: గన్నవరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ న్యాయ పోరాటం ఫలించింది. వివిధ కేసుల్లో గత 138 రోజులుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఆయనకు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి బయటకు రావడానికి మార్గం సుగమమైంది.
రెడ్‌బుక్ కక్షతో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వల్లభనేని వంశీమోహన్‌పై ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు చేసింది. రెండున్నరేళ్ల క్రితం గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి కేసు పునర్ విచారణ పేరుతో వంశీమోహన్‌ను 71వ నిందితుడిగా చేర్చింది. ఈ కేసు ఫిర్యాదుదారుడైన సత్యవర్థన్‌ను కిడ్నాప్ చేశారని తప్పుడు కేసు పెట్టి.. ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం టీడీపీ పెద్దల సూచనల మేరకు ఆయనపై గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి, హనుమాన్‌జంక్షన్ పీఎస్‌ల్లో పదికి పైగా అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో గత ఐదు నెలలుగా విజయవాడ జిల్లా జైలులో ఆయన రిమాండ్‌లో కొనసాగుతున్నారు.
ఆరోగ్యం క్షీణించినా..
గణనీయంగా బరువు తగ్గిపోవడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్ సీపీ ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం కరుణించలేదు. ప్రభుత్వం తరఫున ఆయనకు సరైనా వైద్య సేవలు కూడా అందించలేదు. చివరికి హైకోర్టు జోక్యంతో ఆయుష్ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో తనపై కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై న్యాయ పోరాటం సాగిస్తూ వచ్చిన ఆయనకు తొమ్మిది కేసుల్లో కోర్టుల నుంచి ఉపశమనం లభించింది. చివరికి బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీపై 2019లో నమోదైన కేసులో కూడా నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు భారీ ఊరట లభించింది. జైలు నుంచి ఆయన బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందని వంశీమోహన్ తరఫు న్యాయవాదులు పేర్కొంటున్నారు. వంశీమోహన్‌కు బెయిల్ రావడం పట్ల నియోజకవర్గంలోని వైఎస్సార్ సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బెయిల్ మంజూరు.. నేడు విడుదలయ్యే అవకాశం