గూడూ పోయే.. దారీ కరువాయె | - | Sakshi
Sakshi News home page

గూడూ పోయే.. దారీ కరువాయె

Jul 2 2025 7:24 AM | Updated on Jul 2 2025 7:24 AM

గూడూ

గూడూ పోయే.. దారీ కరువాయె

రోడ్డు విస్తరణ పేరుతో అడ్డంగా ఉన్నాయంటూ పక్కా ఇళ్లను హడావిడిగా కూల్చేశారు. పరిహారం ఇస్తామని చెప్పారు.

– ఇది 2016 నాటి మాట

మరోవైపు కమీషన్లకు ఆశపడి ముందస్తు అంచనాలు, వర్క్‌ ఆర్డర్లు లేకుండా పనులను మొదలు పెట్టారు. కానీ కాంట్రాక్టర్‌ కిలోమీటర్‌ దారికి రూ.కోటి కొట్టేయాలనుకుని ప్రతిపాదన పంపాడు. దీన్ని ప్రభుత్వం తిరస్కరించడంతో పనులను మధ్యలోనే ఆపేశాడు.

– ఇది ప్రస్తుత పరిస్థితి

జి.కొండూరు: ‘లోకేశ్‌.. మా ఊరి దారి సమస్య పరిష్కరించండి’ అంటూ మంత్రి నారా లోకేశ్‌ ఫొటోలతో మైలవరం మండలం వెల్వడం గ్రామస్తులు ఫ్లెక్సీలతో మంగళవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం మైలవరం నుంచి నూజివీడు వెళ్లే రహదారిని విస్తరించే క్రమంలో వెల్వడంలో కొన్ని సర్వే నంబర్లు నోటిఫై చేశారు. రహదారి అభివృద్ధి పనులను నాలుగు నెలల కిందట హడావిడిగా చేపట్టారు. మార్గం పొడవునా వెట్‌ మిక్స్‌ వేశారు. అయితే అర్ధంతరంగా రహదారి విస్తరణ నిలిచిపోయింది. దీంతో ఎండొస్తే దుమ్ము, వానొస్తే రహదారిపై గోతుల్లో చేరిన నీటితో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై అధికారులకు మొరపెట్టుకున్నా ప్రయోజనం కనిపించలేదు. దీంతో గ్రామస్తులంతా దారిపొడవునా నారా లోకేశ్‌ ఫొటోలతో ఫ్లెక్సీలు కట్టారు. ఇదిలా ఉంటే 2016 రహదారి విస్తరణలో గ్రామంలో కొందరి ఇళ్లను కూల్చేశారు. పరిహారం ఇవ్వలేదు. దీంతో వారు సైతం లోకేశ్‌ ఫొటోలతో ఫ్లెక్సీలు వేయించి వినూత్న నిరసనకు దిగారు.

కాంట్రాక్టర్‌ అత్యాశ.. మొదటికి వచ్చిన సమస్య

మైలవరం–నూజివీడు ఆర్‌ఆండ్‌బీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా వెల్వడం అయ్యప్ప స్వామి గుడి నుంచి ఐదు కిలోమీటర్ల మేర ఉన్న తారు రోడ్డును అంచనాలు, వర్క్‌ ఆర్డర్లు లేకుండా పూర్తిగా తొలగించి నాలుగు నెలల క్రితం రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు. తారు రోడ్డును పూర్తిగా తొలగించడానికి ఆర్‌అండ్‌బీ అధికారులు అడ్డుచెప్పినా కాంట్రాక్టరు తనకు స్థానికంగా రాజకీయ అండ ఉందనే ధోరణికి పోయాడు. తారురోడ్డును తవ్వి వెట్‌మిక్స్‌ వేసిన తర్వాత నిధుల మంజూరుకు ప్రభుత్వం నుంచి అనుమతి కోరారు. కిలోమీటరుకు రూ.కోటి వరకు ఖర్చు అవుతుందని ప్రతిపాదనలు పంపాడు. వీటిని ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కాంట్రాక్టరు మూటా ముల్లె సర్దుకొని వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో నిత్యం రాకపోకలు సాగుతుండటంతో వెట్‌మిక్స్‌ కదిలి రహదారి అంతా ఛిద్రంగా మారింది. దారిపొడవునా గుంతలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో గుంతల్లో నీరు చేరి చిన్న కొలనుల్లా తలపిస్తున్నాయి.

రహదారి విస్తరణ పేరుతో హడావిడిగా ఇళ్లను కూల్చేసిన అధికారులు మధ్యలోనే పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌ అర్ధంతరంగా నిలిచిన మైలవరం–నూజివీడు రహదారి పనులు రహదారి బాగు చేయాలంటూ మంత్రి లోకేశ్‌ ఫొటోతో వెలిసిన ఫ్లెక్సీలు

లోకేష్‌ ఫ్లెక్సీతో నిరసన తెలుపుతున్న గ్రామస్తులు

ఈ ఫొటోలోని వృద్ధ దంపతుల పేర్లు చనుమోలు సత్యనారాయణ, సామ్రాజ్యం. వీరికి వెల్వడం గ్రామంలో సర్వే నంబరు 498/1లో ఇల్లు ఉంది. అయితే 2016లో మైలవరం–నూజీవీడు ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణలో భాగంగా వీరి ఇంటిని అధికారులు కూల్చారు. అప్పటి నుంచి వీరికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు. దీనిపై అధికారులను సంప్రదించగా ఇళ్లు కూల్చిన స్థలంలో రోడ్డు వేయలేదని, పరిహారం ఇవ్వాల్సిన పనిలేదని చెప్పినట్లు బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మంత్రి లోకేశ్‌ ఫ్లెక్సీని గ్రామంలో కట్టారు.

గూడూ పోయే.. దారీ కరువాయె1
1/2

గూడూ పోయే.. దారీ కరువాయె

గూడూ పోయే.. దారీ కరువాయె2
2/2

గూడూ పోయే.. దారీ కరువాయె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement