కోడూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హంసలదీవి సాగరతీరం బీచ్ గేట్లను మూసివేసినట్లు ఇన్‌చార్జి ఫారెస్ట్ ఆఫీసర్ మోహిని విజయలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడన ప్రభావంతో సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో పాటు ఈదురుగాలులు తీవ్ర కూడా పెరిగిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీ వరకు బీచ్ గేట్లను మూసి వేస్తామని వివరించారు. పర్యాటకులు సహకరించి ఈ మూడు రోజుల పాటు బీచ్‌కు రాకుండా ఉండాలని కోరారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచే బీచ్ గేట్లకు అటవీ అధికారులు తాళాలు వేశారు.
త్వరలో ఎ.కొండూరుకు
కృష్ణా జలాలు
తిరువూరు: మరో 45 రోజుల్లో ఎ.కొండూరు మండలానికి కృష్ణా నదీజలాలను సరఫరా చేస్తా మని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎ.కొండూరులో జల్‌జీవన్ మిషన్ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. త్వరితగ తిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత తాగు నీరందించే లక్ష్యంతో జల్ జీవన్‌మిషన్ అమలవుతోందన్నారు. కిడ్నీబాధిత తండాలకు కృష్ణా నదీ జలాలు ఇచ్చే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి జరుగుతోందని, ఇప్పటికే ప్రధాన పైపులైను పనులు పూర్తయ్యాయని వివరించారు. అనంతరం కంభంపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పరిశీలించారు.
డెంగీపై విస్తృత అవగాహన కల్పించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగీ నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం డెంగీ డే సందర్భంగా వ్యాధిపై అవగాహన కల్పించే రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను డాక్టర్ మాచర్ల సుహాసిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఈ నెలరోజులు యాంటీ డెంగీ, యాంటీ మలేరియా మాసంగా పాటిస్తామని తెలిపారు. డెంగీ, మలేరియా ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయా వ్యాధులపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రతి పట్టణ ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా ఈ నెల రోజులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతి బాబు, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ బాలాజీ, డాక్టర్ కార్తీక్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.