
సీఎస్‌ఆర్ నిధుల మంజూరుకు అంచనాలు తయారుచేయండి
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల మంజూరుకు అంచనాలు తయారుచేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో స్మార్ట్ ఆంధ్ర ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఎన్.నరేష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన, రక్షిత మంచినీటి పథకాలకు అవసరమైన మరమ్మతులు, దివ్యాంగులకు ఉపకరణాలు, మునిసిపాల్టీలకు చెత్తను తరలించే ట్రాక్టర్లు తదితర అవసరాల కోసం ఆయా శాఖల అధికారులు అంచనాలు రూపొందించి నివేదిక సమర్పించాలన్నారు. నివేదిక తయారీలో ప్రాధాన్యత పనులను దృష్టిలో ఉంచుకుని తయారుచేయాలన్నారు. ప్రస్తుతం కొన్ని శాఖలు నిధుల మంజూరు కోరుతూ పనులను ప్రతిపాదించాయని అయితే ప్రాధాన్యత గల పనులను సూచిస్తూ సవరించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. గుడివాడలో తాగునీటి వసతి కల్పనకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ హామీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రక్షిత మంచినీటి పథకాల మరమ్మతులకు అవసరమైన నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో సీటీస్కాన్ పరికరం కొనుగోలు, భవనాలు లేని పాఠశాలల్లో నిర్మాణాలు, మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఏఆర్‌టీ సెంటర్ భవన నిర్మాణం, పలు పీహెచ్‌సీల్లో అవసరమైన వైద్యపరికరాల కోసం తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో సీపీవో ఎస్.భీమరాజు, డీఈవో పీవీజే రామారావు, సమగ్ర శిక్ష ఏపీసీ కుముదిని సింగ్, మునిసిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు కలెక్టర్ బాలాజీ ఆదేశం