
అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు
కోనేరుసెంటర్: మీకోసంలో అందిన అర్జీలను తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు సిబ్బందిని ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ న్యాయం కోసం వచ్చే బాధితులకు అండగా నిలబడి న్యాయం జరిగేలా చూడటమే మన కర్తవ్యమన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలనిని, ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మసలుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, ఫిర్యాదుదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలన్నారు. ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా మాట్లాడినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీకోసం కార్యక్రమంలో మొత్తం 38 అర్జీలు అందుకున్నట్లు చెప్పారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మీకోసంలో జిల్లా ఎస్పీ గంగాధరరావు