
ప్రతిభకు కార్పొరేట్ వల
కంకిపాడు: ‘‘ఇంటర్‌లో స్టేట్ 1, 2, 3 ర్యాంకులు మావే... నీట్, ఎంసెట్‌లోనూ మేమే టాప్..’’ అంటూ కార్పొరేట్ విద్యాసంస్థలు తమ స్థాయిని పదిలం చేసుకోవాలంటే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటేనే సాధ్యం. అందుకు ప్రతిభావంతులైన విద్యార్థులు పక్క విద్యాసంస్థల్లో చేరకుండా తమ సంస్థల్లోనే అడ్మిషన్లు పొందేలా చేసుకోవాలి. దీంతో పలు విద్యాసంస్థలు అడ్మిషన్లలో తీవ్ర పోటీ పడుతున్నాయి. ప్రతిభావంతులను చేర్చుకునే పనిలో పడ్డాయి.
సమయం లేదుగా...
ఈ విద్యాసంవత్సరం ఇంటర్మీడియెట్ తరగతులు జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు తమకు అనువైన, అందుబాటులో ఉన్న కళాశాలల్లో కోర్సులను ఎంపిక చేసుకుని అడ్మిషన్లను పొందుతున్నారు. ఈ కొద్ది రోజుల సమయాన్ని వినియోగించుకుని అడ్మిషన్లను భారీగా నమోదు చేసుకునే పనిలో పేరొందిన కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన విద్యాసంస్థలు నేడు గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాంచిలను అందుబాటులోకి తెచ్చి గ్రామీణ విద్యార్థులను చేర్పించుకుంటూ, అందుబాటులోనే తమ సంస్థ బ్రాంచిలు ఉన్నాయంటూ ప్రచారంలో ముందున్నాయి.
ఆఫర్లే...ఆఫర్లు
పది ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులపై టాప్–5లో ఉన్న కార్పొరేట్ సంస్థలు దృష్టి సారించాయి. వారు చదివిన పాఠశాలల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరించి వారిని నేరుగా కలుసుకుని అడ్మిషన్లను ఖాయం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభను చూసి ఆఫర్లు ఇస్తున్నారు. 550 మార్కులు దాటితే ఫీజులో 50 శాతం రాయితీ, 575 మార్కులు దాటితే 75 శాతం రాయితీ, 590 పైన మార్కులు వస్తే 80–90 శాతం వరకూ ఫీజుల్లో రాయితీ, అవసరమైతే అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తామంటూ ఆఫర్లు మీద ఆఫర్లు అందిస్తున్నారు. ఇదే క్రమంలో గత విద్యాసంవత్సరంలో తమ సంస్థకు వచ్చిన ర్యాంకులు, నీట్, ఎంసెట్ ఫలితాల్లో టాప్‌గా నిలిచామంటూ ప్రకటనలను చూపించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆకర్షణ మంత్రం వాడుతున్నారు. ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ అన్నింటికి కోచింగ్ ఇదే ఫీజులో అందిస్తామంటూ ఆశ చూపుతున్నారు.
ఇంటర్‌లో అడ్మిషన్ల కోసం క్యూలు కడుతున్న వైనం విద్యార్థుల ఇళ్ల చుట్టూ అధ్యాపకుల ప్రదక్షిణలు రకరకాల ఆఫర్ల పేరుతో ఆకర్షించే యత్నం
అడ్మిషన్లు మిస్సయితే జీతాలు కట్
కొంతమంది విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభను తమ ఖాతాలో వేసుకుని కోట్లు దండుకుంటున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. టెన్త్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు వల వేసి, వారికి ఫీజుల్లో 50 నుంచి 90 శాతం వరకు కూడా రాయితీల ఆశ చూపించి తమ సంస్థల్లో చేర్చుకుంటాయి. ఇంటర్‌లో వారు సాధించిన ర్యాంకులను తమ గొప్పలుగా చెప్పుకొంటూ లక్షలాది అమాయక విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నాయి.
మరో వైపు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మెడపై కార్పొరేట్ సంస్థలు కత్తి పెడుతున్నాయి. ఎంపిక చేసుకున్న విద్యార్థుల అడ్మిషన్ నూరు శాతం ఓకే అవ్వాలి. అడ్మిషన్ల సంఖ్య తగ్గినా, ముఖ్యమైన టార్గెట్ మిస్సయినా మే నెల జీతాలు ఉండబోవని ఆయా సంస్థలు తమ సిబ్బందికి టార్గెట్‌లు నిర్ణయిస్తున్నాయి. దీంతో సిబ్బంది చేసేది లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎలాగోలా అడ్మిషన్ ఓకే అయ్యేలా చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు.