
ఉత్కంఠభరితంగా ఎడ్ల బండ లాగుడు పోటీలు
రెండు పళ్ల విభాగం విజేతలకు బహుమతుల అందజేత
నందిగామరూరల్: మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఉన్న లక్ష్మీ పేరంటాళ్లు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహిస్తున్న ఎడ్ల బండ లాగుడు పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోటీలలో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన నాలుగు పళ్ల విభాగంలో ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలను ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకటలక్ష్మీ సాయిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు ప్రదర్శన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాలుగు పళ్ల విభాగంలో ఏడు జతలు పోటీ పడ్డాయని, 15 నిమిషాల వ్యవధిలో 8.50 క్వింటాళ్ల బండను లాగినట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ఎడ్ల జత యజమానులకు అంబారుపేట గ్రామంలోని సత్యమ్మ అమ్మవారి ఆలయ మాజీ చైర్మన్ గరికపాటి భాస్కరం సోదరులు వస్త్రాలు, జ్ఞాపికలను అందజేశారు.
నగదు బహుమతుల అందజేత
గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన రెండు పళ్ల ఎడ్ల ప్రదర్శన పోటీలలో విజేతలైన ఎడ్ల జత యజమానులకు కమిటీ సభ్యులు నగదు బహుమతులు అందజేశారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన కేఎంకే బుల్స్ కడియం మణికంఠ ఎడ్ల జత మూడు వేల అడుగుల దూరం లాగి ప్రథమ స్థానంలో నిలవగా, సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన కేఆర్‌ఆర్ బుల్స్ కొప్పుల గోవర్దన్‌రెడ్డి ఎడ్ల జత 2,695.09 అడుగుల దూరం లాగి ద్వితీయ స్థానం, గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగం జాగర్లమూడికి చెందిన జమ్మనబోయిన సుబ్రహ్మణ్యం ఎడ్ల జత 2,061 అడుగుల దూరం లాగి తృతీయ స్థానంలో నిలిచాయన్నారు. చందర్లపాడు మండలం బ్రహ్మబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన పాలెం వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం రాగిపాడుకు చెందిన యద్దనపల్లి మనోజ్ చౌదరి ఎడ్ల జత 2,045 అడుగుల దూరం లాగి నాలుగవ స్థానం, బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం గ్రామానికి చెందిన పోకల శ్రీనివాసరావు నాయుడు, పద్మావతి నాయుడు ఎడ్ల జత 1,750 అడుగుల దూరం లాగి ఐదవ స్థానం, నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బట్ట కార్తికేయ యాదవ్ ఎడ్ల జత 1,554 అడుగుల దూరం లాగి ఆరవ స్థానంలో నిలిచాయని తెలిపారు. విజేతలకు వరుసగా రూ.25 వేలు, రూ.20 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.12 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు, రాంబాబు, విక్రమ్, రాంబాబు, వెంకట్రావ్, శివాజీ పాల్గొన్నారు.