
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి
ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి
డాక్టర్ సుహాసిని
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరమై ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని తెలిపారు. ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం, వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదామని ఆమె పిలుపునిచ్చారు. ఎండ తీవ్రత వలన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి (104.9 డి.ఎఫ్) మెదడు మీద ప్రభావం చూపుతుందని, దీని వలన మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారని చెప్పారు. దీనినే ‘హీట్ స్ట్రోక్‘లేదా ’సన్ స్ట్రోక్ ‘అంటారని, ఇది ప్రమాదకరం, ప్రాణాంతకమని హెచ్చరించారు. వాతావరణపు వేడిమికి శరీరం ఎక్కువసేపు గురికావడం వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోవడం, శరీరంలో నీటి నిష్పత్తి తగ్గిపోవడం సంభవిస్తుందని, అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాలలో ఎక్కువ శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు మూడు లేక నాలుగు లీటర్ల నీటిని చెమట రూపంలో మన శరీరం కోల్పోయి వడదెబ్బకు ఎక్కువగా గురవుతారని డాక్టర్ సుహాసిని తెలిపారు. వయస్సు 65 ఏళ్లు దాటిన వారు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడే వారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.