
దమననీతిపై నిరసన స్వరం
ప్రశ్నించే గొంతులను నొక్కడం అప్రజాస్వామికం అంటున్న ప్రజాసంఘాలు
చిలకలపూడి(మచిలీపట్నం)/ఘంటసాల (అవనిగడ్డ)/చల్లపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగంలో భాగంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కూటమి ప్రభుత్వం సంకెళ్లు వేసే దిశగా అడుగులు వేస్తోంది. తప్పును తప్పుగా చెబుతూ చెడును వివరించే రీతిలో పత్రికలు పనిచేయడాన్ని చూసి ఓర్వలేక, కేసుల రూపంలో భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది. పత్రికాస్వేచ్ఛను అణగదొక్కాలనే రీతిలో అరాచకాలు సృష్టిస్తోంది. దీనిలో భాగంగానే ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి ఇంటిపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. సెర్చ్ వారెంట్లు లేకుండా.. ఇంట్లోకి జొరబడి మూడు గంటల సేపు పోలీసులు వేధించారని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు పది నెలలు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి.. ధనార్జనే లక్ష్యంగా కూటమి పార్టీలోని ప్రతి నాయకుడూ అధికార దర్పంతో ముందుకు సాగుతున్నారని విమర్శిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కాలరాస్తే సహించేది లేదని.. గళమెత్తి పోరాటం చేస్తామని బాహాటంగానే చెబుతున్నారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు..
కూటమి ప్రభుత్వం పాల నలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. ప్రశ్నించే వారిపై కేసులు నమోదు చేసి కుట్రపూరితంగా అరెస్టులు చేపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అరాచకత్వాలను ప్రేరేపిస్తున్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటికి వెళ్లి సోదాలు చేయటం కక్ష సాధింపు చర్యే.
– జక్కుల ఆనంద్‌బాబు, జిల్లా అధ్యక్షుడు, దళిత జేఏసీ
ఫోర్త్ ఎస్టేట్‌పై దాడి..
హేయమైన చర్య
మారుతున్న ప్రభుత్వాల వైఖరి కారణంగా పత్రికా స్వేచ్ఛ క్రమంగా మసకబారుతోంది. రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకారం ఫోర్త్ ఎస్టేట్‌గా పిలిచే మీడియా ఎంత దృఢంగా ఉంటే సమాజం అంత అభివృద్ధి చెందుతుంది. పాలకుల లోపాలను, ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు గొంతెత్తే మీడియా సంస్థలు, వాటి ప్రతినిధులపై అక్రమ దాడులు నిర్వహించటం మానుకోవాలి.
– శీలం నారాయణ, సీపీఎం జిల్లా
కార్యదర్శి వర్గ సభ్యులు
ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం
పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు నిర్భంధ సోదాలు నిర్వహించడం సరికాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ప్రతివ్యక్తికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినపుడు వాటిని ఖండించడమో, లేదంటే వివరణ ప్రకటించేలా చేయడమో చేయాలి. ఇంకా పరువుకు భంగం కలిగిస్తే పరువు నష్టం దావా వేయాలి. అంతేకానీ ప్రభుత్వం పోలీసుల ద్వారా భయపెట్టే పనులు చేయడం మంచిది కాదు. ఒక ప్రధాన పత్రికలో పనిచేస్తున్న ఎడిటర్ ఇంట్లోనే హక్కులు హరించేలా ఇలా సోదాలు జరగడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఈ ఘటనపై ప్రభుత్వం కచ్చితంగా బాధ్యత వహించాలి.
– జెక్కా కేశవరావు, పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ సభ్యుడు, ఘంటసాల

దమననీతిపై నిరసన స్వరం

దమననీతిపై నిరసన స్వరం

దమననీతిపై నిరసన స్వరం