
నిర్లక్ష్యాన్ని సహించను
ఉపాధి లక్ష్యాల సాధనలో
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు 80 లక్షల పనిదినాలను కల్పించాలనే లక్ష్యాన్ని సాధించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, లక్ష్య సాధనలో నిర్లక్ష్యాన్ని సహించనని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. పనుల నిర్వహణలో వెనుకబడితే చర్యలు తప్పవని, శ్రామికులకు రూ.307 కనీస వేతనం కల్పించి ఆర్థిక ఊతం ఇచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపడుతున్న పనుల ప్రగతిపై బుధవారం నీటి యాజమాన్య సంస్థ అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు, మండలాభివృద్ధి అధికారులు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ అధికారులతో కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా శ్రామికులకు పని కల్పించి వారికి ఆర్థిక ఊతం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఎటువంటి అలసత్వం వహించినా సహించేది లేదన్నారు. ఈ ఏడాది శ్రామికులకు 80 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటివరకు కేవలం 13.40 లక్షల పని దినాలను మాత్రమే కల్పించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేసి లక్ష్య సాధన వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నారు. జగ్గయ్య పేట, నందిగామ, చందర్లపాడు, రెడ్డిగూడెం విస్సన్నపేట, ఎ.కొండూరు మండలాలలో ఆశించిన స్థాయిలో లేదని, ఆయా మండలాల అధికారులు మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి హామీ ద్వారా 3వేల పంట కుంటలను నిర్మించాలని లక్ష్యం కాగా, ఇప్పటివరకు 572 కుంటలు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఉపాధి హామీ పనులలో ఉద్యాన పంటల పనులకు ఆర్థిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు ప్రతి గ్రామంలో కనీసం 20 ఎకరాలను గుర్తించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సరాసరి 294 రూపాయలు మాత్రమే శ్రామికులకు లభిస్తోందని చేపట్టనున్న పనుల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన రూ.307 దినసరి కనీస వేతనం తప్పనిసరిగా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం ప్రాజెక్టు డైరెక్టర్ ఎ.రాము, ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు పి. బాలాజీ కుమార్, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
శ్రామికులకు కనీస వేతనం రూ.307 కల్పించాలి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ