పెనమలూరు: సైబర్ నేరగాళ్లు ఒక వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.21 లక్షలు స్వాహా చేయటంతో పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాల ప్రకారం... యనమలకుదురు సాయినగర్‌కు చెందిన మొటుపల్లి రఘురామ్ అజంతా ఫార్మసీ లిమెటెడ్ కంపెనీలో సీనియర్ రీజినల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగ రీత్యా ఈ నెల 13వ తేదీన విశాఖపట్నం వెళ్లాడు. ఆ సమయంలో ఆయనకు 07980118947 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తాను ఐసీఐసీఐ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని ఖాతాను ఈకేవైసీ చేసి అప్‌డేట్ చేయాలని చెప్పాడు. వాట్సాప్‌కు లింకు పంపాడు. రఘురామ్ అది నిజమేనని నమ్మి లింకు క్లిక్ చేశాడు. కొద్ది సమయం తరువాత రూ.2,00,995 లావాదేవి జరిగినట్లు కన్ఫర్‌మేషన్ కాల్ వచ్చింది. వచ్చిన రికార్డు కాల్‌లో 1వ నంబర్ నొక్కితే కనఫర్‌మేషన్ చేసినట్లు, 9వ నంబర్ నొక్కితే ఎకౌంట్‌బ్లాక్ చేసినట్లు తెలిపింది. దీంతో రఘురామ్ అనుమానం వచ్చి బ్లాక్ చేయటానికి 9వ నెంబర్ బటన్ నొక్కాడు. ఆ తరువాత ఓటీపీలు రావటంతో బ్యాంకు వెళ్లి వివరాలు అడిగాడు. ప్రీఅప్రూవ్డ్ లోన్ రూ.15 లక్షలు, క్రెడిట్ కార్డు లిమిట్ రూ.1.25 లక్షల నుంచి రూ.6 లక్షలు పెంచామని బ్యాంకు అధికారులు తెలిపారు. మొత్తం రూ.21 లక్షలు సైబర్ నేరగాళ్లు రఘురామ్ బ్యాంకు ఖాతా నుంచి డ్రా చేశారు. రఘురామ్ లింక్ క్లిక్ చేసిన తరువాత అతని ఫోన్ నెట్‌వర్కు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కటంతో ఆయనకు తెలియకుండానే బ్యాంకులోన్ మంజూరు చేయించుకొని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకొని సొమ్ము కాజేశారు. ఈ ఘటన పై బాఽధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.