
ఎ.కొండూరు(తిరువూరు): కుటుంబ కలహాలతో భార్యను భర్త అతి కిరాతకంగా నరికి చంపాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన ఎం. లక్ష్మితో అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావుకు 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. కుమార్తె, ఒక కుమారుడికి వివాహం చేశారు. మరొక కుమారుడు తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. కుటుంబ కలహాలతో భార్యభర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి భర్త కోటేశ్వరరావు మద్యం తాగి భార్యతో గొడవపడి గొడ్డలితో అతిదారణంగా నరికాడు. లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరువూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఆర్. అంకారావు తెలిపారు.
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాయిరాం థియేటర్ ప్రాంతానికి చెందిన అంబటి శేషకుమారి, లాజరిసీ భార్యభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడైన సోమశేఖర్ ఐటీఐ చదివి ప్రస్తుతం ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. సోమశేఖర్ మద్యానికి బానిసై తల్లిని తరచూ డబ్బులు అడుగుతుంటాడు. దీంతో తండ్రి మందలించేవాడు. బుధవారం రాత్రి తల్లి వద్దకు వచ్చిన సోమశేఖర్ డబ్బులు కావాలని తల్లిని అడగడంతో వాదన జరిగింది. దీంతో బయటకు వెళ్లి వచ్చిన సోమశేఖర్ తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నిద్ర లేచిన తల్లి శేషకుమారి కుమారుడు ఉరికి వేలాడుతూ కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేయడంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడు దుర్మరణం
కంచికచర్ల : వేగంగా వస్తున్న లారీ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన కంచికచర్లలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పెంకె సత్య వెంకట సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాలు.. మండలంలోని పరిటాల గ్రామానికి చెందిన కటారపు అనిల్(21) అనే యువకుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఓ పనికోసం కంచికచర్ల వచ్చి తిరిగి బైక్‌పై పరిటాల వెళ్తున్నాడు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో పప్పుల మిల్లు దగ్గరకు రాగానే నేషనల్ హైవేపై ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.