మూడో విడతకు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బుధవారం నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం మొదలుకానుంది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మూడో విడతలో ఆసిఫాబాద్ మండలంలో 27 పంచాయతీలు, 236 వార్డులు, కాగజ్‌నగర్‌లో 28 జీపీలు, 266 వార్డులు, రెబ్బెనలో 24 పంచాయతీలు, 214 వార్డులు, తిర్యాణిలో 29 జీపీలు, 222 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ మండలంలో ఏడు క్లస్టర్లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుంపెల్లి కేంద్రంలో చిర్రకుంట, పాడిబండ, తుంపెల్లి, కోసార, మాలన్‌గొంది, రాజంపేట్‌లో రాజంపేట్, సాలెగూడ, గోవింద్‌పూర్, గుండి, బూర్గుడలో బూర్గుడ, ఈదులవాడ, చిలాటిగూడ, చోర్‌పల్లి, మోతుగూడలో అప్పపల్లి, రౌటసంకెపల్లి, మోతుగూడ, రహపల్లి, బాబాపూర్‌లో బాబాపూర్, అంకుసాపూర్, కౌటగూడ, అడలో అడ, మానిక్‌గూడ, ఎల్లారం, మోవాడ్ క్లస్టర్‌లో మోవాడ్, వెంకట్‌పూర్, అడ దస్నాపూర్, వావుదాం పంచాయతీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రహపల్లి, చిలాటిగూడ రిజర్వేషర్ల ప్రకారం సర్పంచ్ అభ్యర్థులు లేరు. కేవలం 25 పంచాయతీల్లోనే సర్పంచులకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.
కొత్త పంచాయతీ ‘రాజంపేట్’
కొత్త పంచాయతీ రాజంపేటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో భాగంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం రాజంపేట్‌ను విభజించి గత ఫిబ్రవరిలో కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 1,950 వరకు కుటుంబాలు, 2,800 మంది నివసిస్తున్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్, 10 వార్డుల్లో ఐదు ఎస్టీ, ఐదు ఇతరులకు రిజర్వ్ చేశారు. పంచాయతీ తొలి సర్పంచ్‌గా ఎవరు నిలుస్తారో ఈ నెల 17న తేలనుంది.
ముగిసిన రెండోవిడత గడువు
రెండో విడత నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్, దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి)లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది.
మూడో విడతకు సర్వం సిద్ధం


