పల్లెల్లో గన్ కల్చర్!
కౌటాలలో కలకలం రేపిన బెదిరింపు ఘటన ఈజీ మనీ కోసం బరితెగింపు కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక
కౌటాల/చింతలమానెపల్లి: కౌటాల మండలంలో తుపాకులు పట్టబడడం కలకలం సృష్టించింది. మాఫియా, ముఠాలు, కిడ్నాపర్ల కార్యకాలాపాల తరహాలో ఓ వ్యక్తి గన్ కొనుగోలు చేసి స్థానిక వ్యాపారిని బెదిరించడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబయి, హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన గన్ కల్చర్.. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు, పిస్టళ్లు తెప్పించుకుని దాడులకు తెగబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
సినిమాలు, యూట్యూబ్ వీడియోల ప్రభావం..
ఇటీవల వచ్చిన సినిమాలు, యూట్యూబ్ వీడియోల్లోని మాఫియా ప్రభావం యువతపై పడుతోంది. స్మగ్లర్లు, దొంగలను హీరోలుగా చిత్రీకరించడంతో ఆకర్షితులై అదే మార్గాలను ఎంచుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి నేరాలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూట్యూబ్‌తోపాటు ఆన్‌లైన్‌లో తుపాకులు లభించే ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఓ యువకుడు బిహార్ రాష్ట్రానికి చెందినవారిని సంప్రదించి గన్ కొనుగోలు చేసి తీసుకువచ్చాడు.
కొత్తగా విష సంస్కృతి..
జిల్లాలో తుపాకుల సంస్కృతికి సంబంధించి ఎ లాంటి తీవ్రమైన ఘటనలు నమోదు కాలేదు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ప్రముఖులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు వద్ద లైసెన్సు తుపాకులు మాత్రమే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మావోయి స్టు సానుభూతిపరుల వద్ద మాత్రమే నాటు తుపాకులు, తపంచాలు లభ్యమయ్యాయి. కొందరు గుట్టుచప్పుడుగా వన్యప్రాణులను వేటాడేందుకు నాటు తుపాకులు వినియోగించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే గడిచిన దశాబ్ద కాలంగా ఎలాంటి ఘటనలు వెలుగులోకి మాత్రం రాలేదు. పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కౌటాల మండలం సాండ్‌గాంలో రెండు తుపాకులు లభ్యం కావడాన్ని పోలీ సులు తీవ్రంగా భావిస్తున్నారు. కాల్పులకు తెగబడితే పలువురు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండేది. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడంతో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఉపేక్షించం
యువత ఈజీ మనీ కోసం పెడదారి పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆగడాలు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. యూట్యూబ్‌లో నేరపూరిత వీడియోలు చూసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రభుత్వ నిషేధిత చిత్రాలు, సమాచారం కోసం వెతికి నేరాలకు పాల్పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుంది. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. జిల్లాలో గన్ కల్చర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.
– నితిక పంత్, ఎస్పీ
బిహార్ టు సాండ్‌గాం..
కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన కర్బంకర్ అజయ్ అనే యువకుడు బిహార్‌కు వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి సాండ్‌గాంకు తీసుకువచ్చాడు. అజయ్ ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారంతో బిహార్‌కు వెళ్లి అక్కడే గన్ వినియోగించే విధానం తెలుసుకున్నాడు. అక్కడే మూడు బుల్లెట్లతో సాధన కూడా చేశాడు. రైలు మార్గం ద్వారా ఎలాంటి తనిఖీలు దొరకకుండా సాండ్‌గాంకు తుపాకీని తీసుకురావడం గమనార్హం. ప్రాణహిత నది తీరంలో ఒకసారి గాలిలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే అజయ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు.


