జాప్యం.. అన్నదాతకు శాపం | - | Sakshi
Sakshi News home page

జాప్యం.. అన్నదాతకు శాపం

Dec 3 2025 7:31 AM | Updated on Dec 3 2025 7:31 AM

జాప్య

జాప్యం.. అన్నదాతకు శాపం

జిల్లాలో నెమ్మదిగా సాగుతున్న కొనుగోళ్లు వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన పంటను కాపాడుకునేందుకు అపసోపాలు

దహెగాం(సిర్పూర్‌): ఓ వైపు కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, మరోవైపు వాతావరణ మార్పులు రైతులను భయపెడుతున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో రెండు, మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉండటంతో పంటల రక్షణకు కోసం అపసోపాలు పడుతున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ధాన్యం కుప్పల వద్ద నిత్యం కాపలా ఉంటున్నారు. చినుకులకు తడవకుండా టార్పాలిన్లు సిద్ధం చేసుకుంటున్నారు.

ముమ్మరంగా వరికోతలు, పత్తితీత పనులు

ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 3.45 లక్షల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పత్తి పూతకాత రాలింది. చెట్లపై ఉన్న కాయలు నల్లబడ్డాయి. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేచోట కూడా ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్లు మించడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం పత్తితీత పనులు ముమ్మరం చేశారు. అకాల వర్షాలతో వరికోతలు ఆలస్యం కాగా, ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి.

కొనుగోళ్ల తీరుతో నష్టం

జిల్లాలో 41 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు చెబుతున్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌, పెంచికల్‌పేట్‌ మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు జిల్లాలో సీసీఐ కేంద్రాల ద్వారా 1,57,710 క్వింటాళ్లను పత్తి కొనుగోలు చేయగా.. ప్రైవేటులో 11,909 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొదటి విడత పత్తి తీత పనులు పూర్తవుతున్నాయి. రెండో విడతలో చాలా తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసిన పత్తిని ఆరుబయట పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. చినుకులకు తడవకుండా ఇళ్లలో నిల్వ చేసుకోవాలని, ఆరుబట ఉంటే టార్పాలిన్లు కప్పుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలంటున్నారు.

పత్తి ఒకసారి తీసినం

ఈ ఏడాది 30 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. గత నెలలో భారీ వర్షాలకు పూతకాత రాలింది. మరోసారి పూత రావాలని మందులు పిచికారీ చేసిన. ఇటీవల మొదటి విడత పత్తితీత పూర్తయింది. ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మబ్బులు ఉండటంతో ఇంట్లోనే నిల్వ ఉంచిన.

– దేశు, రైతు, దేవులగూడ

కోతలు పూర్తి కాలేదు

మూడెకరాల్లో వరి సాగు చేసిన. గత నెలలో కురిసిన వర్షాలకు పొలం ఆరలేదు. రెండు రోజులుగా మబ్బులు వస్తున్నాయి. పొలంలోకి హార్వెస్టర్‌ రావడం లేదు. కోత అయిన తర్వాత ప్రైవేటు వాళ్లకే అమ్ముతా.

– చప్పిడి రమేశ్‌, దహెగాం

జాప్యం.. అన్నదాతకు శాపం1
1/2

జాప్యం.. అన్నదాతకు శాపం

జాప్యం.. అన్నదాతకు శాపం2
2/2

జాప్యం.. అన్నదాతకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement