నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. దహెగాం మండలం కొత్మీర్, దహెగాం పంచాయతీలతోపాటు పెంచికల్‌పేట్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోస్టల్ బ్యాలెట్, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ.. వంటి అంశాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. దహెగాం మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బీబ్రా జెడ్పీ ఉన్నత పాఠశాల, పెంచికల్‌పేట్ మండలం దరోగవల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యాబోధన తీరు, వంటశాల, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు.


