ఓటీపీలు, యూపీఐ వివరాలు ఎవరికీ చెప్పొద్దు
ఆసిఫాబాద్: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, యూపీఐ వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘ఫ్రాడ్ కా పుల్ స్టాప్’ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం డీజీపీ బి.శివధర్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించగా, ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు. ఆన్‌లైన్ వర్క్‌షాప్‌కు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, బీఎడ్ కళాశాలల విద్యార్థులు 130 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం అవగాహనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఓటీపీ, యూపీఐ మోసాలు, గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్, ఉద్యోగ అవకాశాలు, ఆన్‌లైన్ ట్రేడింగ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియాలో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు రవీందర్, తేజస్విని, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


