ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, హౌజింగ్ అధికారి ప్రకాశ్‌రావుతో కలిసి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 498 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 391 ఇళ్ల పనులు ప్రారంభించారని, మిగితా 107 నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 458 ఇళ్లు మంజూరు కాగా, 150 నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. జాప్యానికి కారణాలు తెలుసుకుని, మెప్మా కింద మహిళా సంఘాలకు రుణ సదుపాయం అందించాలని సూచించారు. ఈ నెల 20లోగా పూర్తయిన ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ డీఈ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
రేపు రోశయ్య వర్ధంతి
మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన కొణిజేటి రోశయ్య వర్ధంతి గురువారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


