అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టాలి
వాంకిడి(ఆసిఫాబాద్): అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టును సోమవారం సందర్శించారు. వాహనాల తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో భద్రత ఏర్పాట్లు పటిష్టం చేశామన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్‌ఎస్‌టీ బృందాలు క్రమం తప్పకుండా రోస్టర్ విధానంలో పని చేయాలని ఆదేశించారు. నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు అక్రమంగా తరలించే అవకాశం ఉందని, క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


