సాంకేతిక సమస్యతో సతమతం
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో పంచాయతీ నామినేష న్ల పర్వం ఊపందుకుంది. ఈ తరుణంలో పోటీ చేసే అభ్యర్థులను ధ్రువపత్రాల కష్టాలు వెంటా డుతున్నాయి. సాంకేతిక సమస్యలతో మీసేవ కేంద్రాల సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సైతం ధ్రువపత్రాలు పొందడం ఆలస్యమవుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా సమస్య
ధ్రువపత్రాల జారీకి పారదర్శకత పాటిస్తూ తక్షణ సేవలను అందించేందుకు జిల్లావ్యాప్తంగా 59 మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. సర్వర్ సమస్యలు తలెత్తడంతో ధ్రువపత్రాల జారీలో అంతరాయం ఏర్పడుతోంది. నివాస, ఆదాయ, కులం, జనన, మరణ ధ్రువపత్రాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
డిక్లరేషన్ తప్పనిసరి
అభ్యర్థుల కులం సర్టిఫికెట్‌ను గెజిటేడ్ స్థాయి అధికారి లేదా డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కాని రెవెన్యూ శాఖకు చెందిన అధికారి సంతకంతో డిక్లరేషన్ చేయాల్సి ఉంది. అధికారి పూర్తి హోదా, ముద్రతో ఉన్న డిక్లరేషన్‌ను అభ్యర్థి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ధ్రువపత్రాల కోసం దరఖాస్తు పెట్టుకునే మీసేవ పోర్టల్‌లోనే సమస్య తలెత్తి, పత్రాల జారీ పక్రియలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరి ష్కారం అవుతుందని పేర్కొంటున్నారు.
సర్వర్ సమస్య ఉంది
జిల్లాలో 59 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. మూడు రోజులుగా మీసేవలో సాంకేతిక లోపంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. సర్వర్ ఇష్యూతో ఓపెన్ అవడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం.
– గౌతం రాజ్, జిల్లా ఈసేవ మేనేజర్
నామినేషన్ల వేళ.. వెలవెల
జిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఐదు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం దహెగాం, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్‌పేట్, బెజ్జూర్ మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 3 నుంచి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీచేసే అభ్యర్థులకు కులం, ఆదాయ, నివాస పత్రాలు సమర్పించాల్సి ఉంది. మీసేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ధ్రువపత్రాలు జత చేయాలి. కీలకమైన ఈ సమయంలో సాంకేతిక లోపంతో ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లాలోని పలు మీసేవ కేంద్రాలు వినియోగదారులు లేక వెలవెలబోయాయి.
సాంకేతిక సమస్యతో సతమతం


