సరిహద్దులు కట్టుదిట్టం!
చింతలమానెపల్లి(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే దేశీదారు మద్యం, డబ్బు, ఇతర సామగ్రి జిల్లాలోని రవాణా కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లాలో మూడు దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు జరగకుండా బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు.
సరిహద్దుల్లో చెక్‌పోస్ట్‌లు
జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల నుంచి మహారాష్ట్రకు రవాణా మార్గాలు ఉన్నాయి. వాంకిడి, సిర్పూర్(టి) మండలం పోడ్సా, మాకిడి, చింతలమానెపల్లి మండలంలోని గూడెం నుంచి మహారాష్ట్రలోని గ్రామాలకు వెళ్లొచ్చు. పోడ్సా, గూడెం వద్ద పెన్‌గంగ, ప్రాణహిత నదులు హద్దులుగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాంకిడి మండలంలోని జాతీయ రహదారితోపాటు సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట, ఇదే మండలంలోని దుబ్బగూడ వద్ద ఎన్నికల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్‌పోస్ట్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ లేదా జీపీవోలు ఇద్దరు, మరో ఇద్దరు ఏఎస్సైలు, లేదా పోలీసు సిబ్బంది, వీడియోగ్రాఫర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల చెక్‌పోస్టులతోపాటు చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. అలాగే మండలాల పరిధిలో ఎస్సైలు, పోలీసులు సైతం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు అక్రమాలపైనా దృష్టి సారిస్తున్నారు.
భిన్న పరిస్థితులు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పొరుగున మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు ఉన్నాయి. త్వరలో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో నిబంధనల అమలు విషయంలో తేడాలు ఉన్నాయి. గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమలులో ఉంది. మహారాష్ట్రలో వినియోగించే కొన్నిరకాల వస్తువులపై తెలంగాణలో నిషేధం ఉంది. జిల్లాలో పత్తి, వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉండటంతో సరిహద్దుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50వేల కంటే ఎక్కువ నగదు కలిగి ఉన్నా, అనుమతి లేకుండా వస్తువులను తరలించినా స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాల్లో వచ్చే వారు వాహనాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలో కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తే బిల్లులు, పన్ను చెల్లించిన పత్రాలు ఉండాలని సూచిస్తున్నారు.
ప్రజలు సహకరించాలి
కౌటాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని ఎస్పీ నితిక పంత్ పే ర్కొన్నారు. అక్రమ రవాణా, నగదు పంపిణీ, మద్యం సరఫరా వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు వాంకిడి, వెంకట్రావ్‌పేట, దుబ్బగూడ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాల తనిఖీలు, నాకబంది చేపడతామని వివరించారు.
సరిహద్దులు కట్టుదిట్టం!


