షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్‌లో దూదిగాం చిన్న సాయన్నకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయన్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం వెళ్లారు. అదేగ్రామానికి చెందిన గండ్ల తులసిబాయి పక్కన అద్దెకు ఉంటుంది. ఈమె నూతనంగా ఇంటి నిర్మించుకుంటుంది. ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా చిన్న సాయన్న పెంకుటిల్లు నుంచి మంటలు వచ్చాయి. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని సింగిల్ ఫేజ్ మోటారుతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న భైంసా ఆగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. సాయన్నకు చెందిన రెండు తులాల బంగారు ఆభరణాలు, తులసిబాయి ఉన్న అద్దెంట్లో రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్‌ఐ లలిత ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగా, దేవుడి వద్ద వెలిగించే దీపం వల్ల షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు.
పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య
రెబ్బెన: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకా రం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన సంగెం మల్లక్క (80) వృద్ధాప్యంతో తన పనులు చేసుకోలేక బాధపడుతోంది. ఎనిమిది నెలల క్రితం అనారోగ్యానికి గురై తుంటి ఎముక విరిగింది. కుటుంబ సభ్యులు శస్త్రచికిత్స చేయించిన నయం కాలేదు. నొప్పి భరించలేక చనిపోతానంటూ కుటుంబ సభ్యులకు చెబుతూ బాధపడుతుండేది. రెండునెలల క్రితం గోదావరిఖనిలో ఉన్న కుమారుడు మధుకర్.. తల్లిని తీసుకెళ్లాడు. శుక్రవారం పింఛన్ డబ్బులు తీసుకునేందుకు మల్లక్క.. స్వగ్రామానికి వచ్చింది. మధ్యాహ్నం గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంట్లో మంచంపై పడి ఉంది. మధుకర్ తమ్ముడి భార్య పద్మ గమనించి పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కుమారుడు మధుకర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం


