కనుల పండువగా కాలభైరవ జయంతి
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో కాలభైరవ స్వామి జయంతి(మహా కాలాష్టమి) శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. మహాకాలాష్టమి రోజున కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. గారెల మాలలు, మద్యం, స్వీట్లు నైవేద్యంగా సమర్పించారు. ఉదయం స్వామి అభిషేకం పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సామూహిక కాలభైరవ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.


