‘నూతన విద్యావిధానంపై ఉద్యమిద్దాం’
ఆసిఫాబాద్‌రూరల్: నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాలీ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన 20వ జిల్లా మహాసభకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా దేశంలో విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా వారి అభివృద్ధి కోసం పీడీఎస్‌యూ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. అందరికీ సమానమైన విద్య అవకాశాలు దక్కాలని జార్జిరెడ్డి, చంద్రశేఖర్, శ్రీపాద శ్రీహరి వంటి వారు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు తరుణ్, సమీర్, వసంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


