మహిళలే టార్గెట్..!
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మాటలతో బురిడీ కొట్టించి నగలతో మాయమవుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాలను చూస్తే అమాయకులు, వృద్ధ మహిళలు, ఇంట్లో ఒంటరిగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నారు. కొత్తరకం దొంగతనాలకు పాల్పడ్డారు. జిల్లాలో పోలీసులు ఓ వైపు ఎన్నికల బందోబస్తులో బిజీగా మారగా, దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు.
మభ్యపెట్టి.. మాయచేసి
ఇటీవల రెబ్బెన మండలం గోలేటి, కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన రెండు చోరీ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ఒంటరిగా ఉన్న మహిళలను మభ్యపెట్టి నగలతో ఉడాయించారు. గతంలో జిల్లాలోని పలు ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని హుండీలు, విగ్రహాలను ఎత్తుకెళ్లేవారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు పోలీసుల చర్యలతో ప్రస్తుతం అవి ఆగిపోయాయి. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ వరుస చోరీలు జరిగాయి. ప్రస్తుతం మహిళలనే టార్గెట్‌గా చేసుకుని దుండగులు బంగారు నగలు దోచుకుంటున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
పోలీసుల గస్తీ నిరంతరం పటిష్టం చేశాం. కాగజ్‌నగర్ పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దొంగలను గుర్తించి త్వరలో పట్టుకుంటాం. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక టీం ఏర్పాటు చే శాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలి.
– వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్
‘అమ్మా.. సార్ పుస్తకాలు పంపించాడు’
కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో చిలుక వీరమ్మ అనే వృద్ధురాలి వద్ద నుంచి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించిన ఇద్దరు దుండగులు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. ‘అమ్మా.. సార్ పుస్తకాలు పంపించాడు. తీసుకోండి’ అంటూ గేటు బయటి నుంచి పిలిచారు. గేటు తీసుకుని ఇంట్లో నుంచి వృద్ధురాలు వచ్చేలోగా ఒక వ్యక్తి లోపలికి తోసుకుని వచ్చి నోరుమూసి వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మెడలోని రెండు తులాల బంగారు చైన్ అపహరించి బైక్‌పై పారిపోయినట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ టౌన్ ఎస్సై సుధాకర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.


