రక్షణపై అవగాహన అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగులు, అధికారులకు రక్షణపై అవగాహన అవసరమని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో గురువారం అన్ని విభాగాల అధిపతులతో వార్షిక రక్షణ పక్షోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రక్షణ సూత్రాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు కళాకారుల పాటలు, నాటికల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ సూత్రాల అమలు, రక్షణ పద్ధతులు పాటించడంలో ఏరియాకు మొదటి స్థానం వచ్చేలా ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఖైరిగూర పీవో నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఎస్‌కే మదీనా బాషా, సీహెచ్‌పీ ఇన్‌చార్జి కోటయ్య, వర్క్‌షాప్ హెచ్‌ఓడీ జ్ఞానేశ్వర్, ఖైరిగూర మేనేజర్ శంకర్, ఎంవీటీసీ మేనేజర్ మధుసూదన్, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


