● ఆ విద్యార్థులంతా ఏ బడిలో చేరారు..? ● వివరాలు క్లియర్
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థులు పాఠశాల మారే సమయంలో ప్రధానోపాధ్యాయుడు ఇచ్చే టీసీతోపాటు ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వాలి. పాఠశాల నుంచి టీసీ జారీ చేస్తూ హెచ్‌ఎం విద్యార్థి వివరాలను ఆన్‌లైన్ డ్రాప్‌బాక్స్‌లో ఉంచుతారు. సదరు విద్యార్థి కొత్తగా చేరిన స్కూల్ హెచ్‌ఎం డ్రాప్‌బాక్స్ నుంచి ఆ వివరాలు తీసుకుంటారు. ఈ ప్రక్రియ పూర్తయితే విద్యార్థి కొత్త బడిలో ప్రవేశం పొందినట్లు పరిగణిస్తారు. డ్రాప్‌బాక్స్ ఖాళీ చేయకుంటే ఆ విద్యార్థి ఏ పాఠశాలలో చేరనట్లుగానే భావిస్తారు. ఇలా జిల్లాలో 3,643 మంది డ్రాప్‌బాక్స్‌లో ఉండటం కలవరపెడుతోంది. బడిలో పాఠాలు వింటున్నా ఏ బడికి చెందని వారిగా మిగులుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలులు గడిచినా ఇంకా వారి వివరాలు డ్రాప్‌బాక్స్‌లోనే ఉండిపోవడం ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంపై ఇటీవల రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు జూమ్ మీటింగ్ ద్వారా ఎంఐఎస్ కోఆర్డినేటర్, సీసీవో, సీఆర్‌పీలతో సమీక్షించారు. డెడ్‌లైన్ విధించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు.
నిర్లక్ష్యంతోనే సమస్య
జిల్లాలో 1,263 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకులాలు, కేబీజీబీలు ఉన్నాయి. 18 జూనియర్ కళాశాలు ఉన్నాయి. పాఠశాలల్లో 92 వేల మంది, కళాశాలల్లో 4,200 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు, టీసీలు ఇవ్వడం గత నెల వరకు దాదాపు పూర్తయ్యింది. అయితే టీసీలు పొంది విద్యార్థులు పాఠశాలలు మారే సమయంలో యూడైస్ ప్లస్‌లోని డ్రాప్‌బాక్స్‌లో నమోదవుతారు. వీరు కొత్త బడిలో చేరితే సంబంధిత పాఠశాలల యాజమాన్యం వారి వివరాలను డ్రాప్‌బాక్స్ నుంచి తీసుకుంటుంది. అయితే కొన్ని పాఠశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో 3,643 మంది ఇంకా డ్రాప్‌బాక్స్‌లోనే ఉన్నారు. విద్యాశాఖ లెక్కల పరిధిలోకి వారు రావడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. స్కూళ్లలో చదువుకుంటున్నా బడిబయట పిల్లలుగా గుర్తించే ప్రమాదం కూడా ఉంది. తల్లిదండ్రులు చొరవ తీసుకుని 11 అంకెల పర్మినెంట్ అకౌంట్ నంబర్(పెన్) ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాలు తెలుసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
గిరిజనులే అధికం..
జిల్లావ్యాప్తంగా అనేక మండలాల్లో గిరిజనులు నివాసం ఉంటున్నారు. నిరక్ష్యరాసులు కావడం, అవగాహన లేకపోవడంతో గిరిజన విద్యార్థులే ఎక్కువ మంది డ్రాప్‌బాక్స్‌లో ఉంటున్నారు. టీసీ తీసుకుని వెళ్లిపోతే మళ్లీ అసలు స్కూల్‌లో చేరుతారో లేదో కూడా తెలియని పరిస్థితి. కొందరు తల్లిదండ్రులు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలస వెళ్లిపోతే వారి సమాచారం తెలియడం లేదు. సంబంధిత సీఆర్‌పీలు, ఎమ్మార్సీ సిబ్బంది డ్రాప్‌బాక్స్‌లో ఉన్న విద్యార్థులను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండి ప్రవేశాలు సక్రమంగా చేపడితే ఈ సమస్య ఉత్పన్నం కాదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.


