అక్రమ కట్టడాలు కూల్చివేత
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని పాత చెక్‌పోస్టు ఎదురుగా ఉన్న కాలనీలో అనుమతులు లేకుండా బీడీపీపీ భూముల్లో నిర్మించారంటూ రెండు ఇళ్లకు సంబంధించి ప్రహరీలను మంగళవారం టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు బుల్డోజర్ సహాయంతో కూల్చివేశారు. ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లేవని తలుపులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, మున్సిపల్ కమిషనర్ గజానంద్, తహసీల్దార్ రియాజ్ అలీ, టీపీఎస్ యశ్వంత్‌కుమార్ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాల కూల్చివేత పనులు చేపట్టగా.. సీఐ బాలాజీ వరప్రసాద్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చినా యజమానులు స్పందించకపోవడంతోనే కూల్చివేసినట్లు ఓ అధికారి వెల్లడించారు. అయితే.. ఇదే నెలలో గృహ ప్రవేశాలు చేయగా, అధికారుల తీరు విస్మయానికి గురిచేసిందని యజమానులు పేర్కొంటున్నారు. అదే రహదారిలో మిగిలిన నిర్మాణాలను వదిలివేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీడీపీపీ భూముల్లోని అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


