● 335 పంచాయతీల్లో 162 సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయిం
ఆసిఫాబాద్: జిల్లాలో పంచాయతీ రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం జీవో 46 విడుదల చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా రిజర్వేషన్లు కేటాయించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ప్రభుత్వ విధివిధానాల ప్రకారం 50 శాతం మించకుండా ఖరారు చేశారు. ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు సైతం చేపట్టారు. రెండు రోజులుగా ఎంపీడీవోలు, ఎంపీవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు.
ఎస్టీలకే అధికం..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. వీటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా కేటాయించారు. సర్పంచ్ స్థానాలకు ఆర్డీవో, వార్డు సభ్యులకు ఎంపీడీవోలు నిబంధనల మేరకు రిజర్వేషన్లు నిర్ణయించారు. మహిళల రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా ఖరారు చేశారు. 335 పంచాయతీల్లో 198 ఎస్టీలు, 32 ఎస్సీలు, 20 బీసీలు, 85 జనరల్ కేటగిరీకి కేటాయించారు. మొత్తం పంచాయతీల్లో 162 స్థానాలు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఏజెన్సీలోని జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్‌లో మొత్తం స్థానాలు ఎస్టీలకే కేటాయించగా, కెరమెరి, ఆసిఫాబాద్, తిర్యాణి, వాంకిడిలోనూ వారికే ఎక్కువ స్థానాలు రిజర్వ్ చేశారు. అలాగే 2,874 వార్డు సభ్యుల స్థానాల్లో అత్యధికంగా 1,660 ఎస్టీలకు, 226 ఎస్సీలు, 231 బీసీలు, 757 జనరల్ కేటగిరీకి ఖరారు చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో అధిక స్థానాలు ఎస్టీలకే కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించగా, తాజాగా కోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రొటేషన్ పద్ధతి అమలు చేశారు.
త్వరలో షెడ్యూల్..
జిల్లాలో 3,53,895 మంది గ్రామీణ ఓటర్లు ఉండగా, వీరిలో 1,76,606 పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు. ఎన్నికల కోసం 2,874 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. త్వరలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లు ఇలా..
మండలం పంచాయతీలు ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్
ఆసిఫాబాద్ 27 19 1 3 4
బెజ్జూర్ 22 9 4 00 9
చింతలమానెపల్లి 19 9 2 1 7
దహెగాం 24 5 6 1 12
జైనూర్ 26 26 - - -
కాగజ్‌నగర్ 28 9 3 6 10
కెరమెరి 31 23 1 - 7
కౌటాల 20 10 3 1 6
లింగాపూర్ 14 14 - - -
పెంచికల్‌పేట్ 12 2 3 1 6
రెబ్బెన 24 4 6 3 11
సిర్పూర్–టి 16 6 2 2 6
సిర్పూర్–యూ 15 15 - - -
తిర్యాణి 29 26 - - 3
వాంకిడి 28 21 1 2 4
● 335 పంచాయతీల్లో 162 సర్పంచ్ స్థానాలు మహిళలకు కేటాయిం


