గిరిజనుల సొంతింటి ‘కల’!
ఇళ్లు మంజూరైనా అనుమతులు రాక సాగని పనులు నిర్మాణాలు అడ్డుకుంటున్న అటవీశాఖ అధికారులు తప్పని ఎదురుచూపులు
సిర్పూర్(టి): జిల్లాలోని గిరిజనులకు సొంతింటి నిర్మాణం కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన గిరిజన పల్లెల్లో అటవీశాఖ నిబంధనలు అడ్డుగా మారాయి. అటవీశాఖ పరిధిలో గ్రామాలు ఉన్నాయని, రిజర్వ్ ఫారెస్ట్ అంటూ అధికారులు పనులు అడ్డుకుంటున్నారు. దశాబ్దాలుగా నివాసముంటున్న వారు అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్నారు. ఇళ్లు మంజూరై నెలలు గడుస్తున్నా జిల్లాలోని పలు గ్రామాల్లో నేటికీ పనులు ప్రారంభం కాలేదు.
‘పైలెట్’ గ్రామంలోనూ..
సిర్పూర్(టి) మండలం మేడిపల్లి గ్రామ పంచాయతీని అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఈ ఏడాది జనవరి 26న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడత కంటే ముందే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు మంజూరు కావడంతో గ్రామస్తులు సంబురపడ్డారు. ఎంతో ఆశగా నిర్మాణాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే అటవీశాఖ అధికారులు నిర్మాణ పనులు నిలిపివేశారు. ఒకవైపు ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు కింద గ్రామాన్ని ఎంపిక చేస్తే.. మరోవైపు అధికారులు గ్రామం అటవీశాఖ పరిధిలో ఉందంటూ అడ్డుకోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడిపల్లి జీపీ పరిధిలోని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టరాదని అటవీశాఖ అధికారులు, ఎంపీడీవో నోటీసులు జారీ చేశారు. అటవీశాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వేలు నిర్వహించారు. సర్వే రిపోర్టులు రాకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. బెజ్జూర్, పెంచికల్‌పేట్, కౌటాల మండలాల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి.


