సత్వరమే అర్జీలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మరణించిన భర్త పేరిట ఉన్న భూమిని తన పేరిట విరాసత్ చేయాలని జైనూర్ మండలం నాయక్‌తండాకు చెందిన జాదవ్ సుజాత దరఖాస్తు చేసుకుంది. రేషన్ కార్డు మంజూరు చేయాలని జిల్లా కేంద్రానికి చెందిన పెంద్రం సత్యవతి అర్జీ అందించింది. గీత కార్మికుడినైన తనకు లైసెన్స్ మంజూరు చేయాలని దహెగాం మండలం లగ్గాం గ్రామానికి చెందిన కొండ్ర భాస్కర్‌గౌడ్ విన్నవించాడు. తన పట్టా భూమిని ఇతరు కబ్జా చేశారని, విచారణ చేప ట్టి న్యాయం చేయాలని తిర్యాణి మండలం చెలిమల కొలాంగూడకు చెందిన టేకం గంగారాం దరఖాస్తు కోరాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని జైనూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్రీమంత, కాగజ్‌నగర్ పట్టణం రిక్షా కాలనీకి చెందిన ఫర్జీన్ సుల్తానాతోపాటు రెబ్బెన మండలం జక్కులపల్లి గ్రామస్తులు వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. నాలుగు నెలల వేతనం ఇప్పించాలని సిర్పూర్(టి) మండల కేంద్రానికి చెందిన బోర్ మెకానిక్ మహమ్మద్ అమీనొద్దీన్ వేడుకున్నాడు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందించిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నా రు. గతంలో అందించిన దరఖాస్తుల వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు లేక అవస్థలు
రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని కాగజ్‌నగర్ మండలం నవేగాం, నాయకపుగూడ, లైన్‌గూడ, ఎల్లాపూర్ గ్రామాల ఆదిమ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి మండల కేంద్రానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో గుంతల పడి బురదమయంగా మారుతుందన్నారు. అత్యవసర సమయంలో రోగులను, ప్రసవం కోసం గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తీసుకెళ్లలేకపోతున్నామని అన్నారు. అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.
సత్వరమే అర్జీలు పరిష్కరించాలి


