మహిళలకు వడ్డీలేని రుణాలు
ఆసిఫాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం ములుగు జిల్లా నుంచి మంత్రి సీతక్క, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్‌డీవోలు, మహిళా సమాఖ్య సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 25లోగా చీరల పంపిణీతోపాటు మహిళలకు వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కులు అందించడం పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. ఈ నెల 25న కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రాల్లో ప్రజాప్రతినిధులతో చీరలు పంపిణీ, చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్‌డీవో దత్తారావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్ తదితరులు పాల్గొన్నారు.
భవన నిర్మాణ కార్మికుల బీమా పెంపు
ఆసిఫాబాద్‌అర్బన్: భవన నిర్మాణ కార్మికుల బీమా సాయం పెంచినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం కార్మిక శాఖ అధికారులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సహజ మరణానికి బీమా సాయాన్ని రూ.1.20 లక్షల నుంచి రూ.2లక్షలకు పెంచిందని తెలిపారు. అలాగే ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ప్రమాద బీమాను రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే రూ.5 లక్షల ఆర్థికసాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. బీమా పథకాలు, గ్రూప్ ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 24 నుంచి డిసెంబర్ 3 వరకు మండల కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం అవగాహన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా నోడల్ అధికారి, ఇన్‌చార్జి సహాయ అధికారి హేమలత తదితరులు పాల్గొన్నారు.


