‘డీసీసీ అధ్యక్ష పదవుల్లో బీసీలకు మొండిచేయి’
ఆసిఫాబాద్: డీసీసీ అధ్యక్ష పదవుల్లో బీసీలకు మొండిచేయి చూపారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నర్ రమేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యంలో జీవో 46 ప్రతులు దహనం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో డీసీసీ పదవులు బీసీలకు ఒక్కటి కూడా ఇవ్వక పోవడం దారుణమన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలకు బీసీలపై ప్రేమ ఉంటే 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి గెలుస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ అవుడపు ప్రణయ్, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వైరాగడే మారుతి పటేల్, సంఘ నాయకులు సిరికొండ సాయికృష్ణ, జూలూరి విలాస్, చాపిడి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


