ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చేస్తోంది!
అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్ పాఠశాల 25 ఎకరాల్లో రూ. 200 కోట్లతో నిర్మాణం వాంకిడి మండలం ఇందాని గ్రామ శివారులో స్థలం కేటాయింపు టెండర్ ప్రక్రియ పూర్తి.. త్వరలో పనులు ప్రారంభం
వాంకిడి: అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ పేరుతో సమీకృత పాఠశాల భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నిర్మించేందుకు అధికారులు స్థలాలు పరిశీలించారు. గతేడాది స్థల సేకరణ పూర్తికాగా ఇటీవల టెండర్ ప్రక్రియ సైతం పూర్తయింది. దీంతో త్వరలో సమీకృత విద్యాలయ భవన నిర్మాణానికి పునాదులు పడనున్నాయి. వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ శివారులో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను హైదరాబాద్‌కు చెందిన విశ్వ సముద్ర ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఈ మేరకు కంపెనీ జీఎం మహీదర్ ఇటీవల స్థలాన్ని పరిశీలించారు. త్వరలో నిర్వహించే భూమిపూజ కార్యక్రమం అనంతరం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
25 ఎకరాల్లో నిర్మాణం..
ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించగా మొదటి విడతలోనే ఆసిఫాబాద్ నియోజకవర్గానికి అవకాశం దక్కింది. ఈ మేరకు జిల్లా అధికారులు త్వరితగతిన స్థల సేకరణ ప్రక్రి య పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో సమీకృత విద్యాలయ భవనాల నిర్మాణానికి త్వరలో పునాదులు పడనున్నాయి. ఇందుకు వాంకిడి మండలంలోని ఇందాని గ్రామం నెలవుగా మారింది. ఇందాని గ్రామ శివారులోని సర్వే నంబర్ 324 లో గల 25 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. రూ.200 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను విశ్వ సముద్ర ఇంజినీరింగ్ కంపెనీ దక్కించుకుంది. ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణంతో పిల్లలకు నాణ్యమైన విద్య అందడంతో పాటు సమీపంలోని గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతాయని మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో నిర్మించనున్నారు. సుమారు 3000 మంది విద్యార్థులు కుల, మత, ఆర్థిక బేధాలు లేకుండా ఒకే చోట చదువుకునేలా భవనాలు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలను కొనసాగిస్తూనే.. అత్యాధునిక వసతులతో సమీకృత భవనాలు నిర్మించనున్నారు. ఆధునిక హంగులతో కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలు కల్పించనున్నారు. సుమారు 25 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ భవనాలు, తరగతి గదులు, ప్రయోగశాలలు, ఆటస్థలాలు, హాస్టల్ భవనాలు, సిబ్బందికి నివాస సముదాయాలు, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, మనసికోల్లాసం కోసం వివిధ క్రీడలకు ప్రత్యేక మైదానాలు, వ్యాయామ శాలలు, గ్రంథాల యం, డైనింగ్ హాల్, తదితర సౌకర్యాలు కల్పిస్తా రు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా సమీకృత భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.


