పంచాయతీ ఎన్నికలకు అడుగు
ఆసిఫాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు అడుగు పడింది. రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 46ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం 50శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించనున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా జిల్లాలో ఆయా సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించనున్నారు. ఇందులో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో అమలు చేయనున్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం వివరాలు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశా రు. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 2024 ఫిబ్రవరి 1న గత పాలకవర్గాల పదవీకాలం పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
జిల్లాలో 335 పంచాయతీలు..
జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో మూడు విడతల్లో ఎన్నికలు జరపడానికి సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు సన్నాహక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, శాంతి భద్రతలపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో సర్పంచ్ స్థానాలు ఎస్టీలకు 198, ఎస్సీ 32, బీసీ 20, జనరల్ 85 స్థానాలు కే టాయించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 22 వరకు ఓటరు జాబితాలోని అ భ్యంతరా లు పరిష్కరించగా, ఆదివారం తుది జాబితా ప్రకటించారు. సమస్యాత్మక, అతి స మస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితా సేకరించి, అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


