నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్‌నగర్ పట్టణంలోని రిటైర్మెంట్ భవనంలో తెలంగాణ అంగన్వాడీటీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ జిల్లా 4వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో అంగన్వాడీ కేంద్రాలు మూతపడే అవకాశముందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలన్నారు. మొబైల్ అంగన్వాడీ సెంటర్ పేరుతో వాహనాల్లో ఆహారాన్ని పంపిణీ చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని, దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల అవసరం లేకుండా పోతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 3నుంచి 6 సంవత్సరాల పిల్లలను విద్యాశాఖలో విలీనం చేసి, ఐసీడీఎస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి త్రివేణి, మాచర్ల వినోద, అరుణ, ఉమాదేవి, సువర్ణ, అనసూర్య, రాధా, మల్లేశ్వరీ, సరిత, నిర్మల, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.


