విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
ఆసిఫాబాద్: విధి నిర్వహణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. జైనూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులు, కేసుల పురోగతి, హాజరు రిజిస్టర్, శుభ్రత విభాగాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన కేసుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శాంతి భద్రతల విషయంలో రాత్రి పర్యవేక్షణ, పికెటింగ్, పెట్రోలింగ్‌ను కొనసాగించాలని ఎస్సై రవికుమార్‌కు సూచించారు. ఎస్పీ వెంట ఏఎస్పీ చిత్తరంజన్, జైనూర్ సీఐ రమేశ్ ఉన్నారు.


